Friday, November 22, 2024

TG | ప్రజలు తెలుసుకున్నారు.. వచ్చేది మేమే : కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన సహచర మంత్రుల ఫోన్లను ట్యాపింగ్‌ చేయిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణ చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఒక జాతీయ ఛానల్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడుతూ… సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా ప్రతిపక్ష నేతల ఫోన్‌లను రేవంత్‌ రెడ్డి ట్యాప్‌ చేస్తున్నారనడానికి అనేక ఆధారాలున్నాయన్నారు.

అలా చేయడం లేదని అనుకుంటే, దమ్ముంటే కెమేరాల ముందు లై డిటెక్టర్‌ పరీక్షకు సీఎం రేవంత్‌ సిద్ధం కావాలని సవాల్‌ చేశారు. ధైర్యం ఉంటే తన సవాల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ స్వీకరించి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించడం లేదని ప్రకటించాలని కేటీఆర్‌ కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు అభూతకల్పనలు ప్రచారం చేశారని మండపడిన కేటీఆర్‌, ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్‌ రెడ్డి అవే నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్‌ రెడ్డి మరింత నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 100 రోజుల్లోనే అనేక హామీలను నెరవేరుస్తామంటూ చెప్పి ఆరు గ్యారెంటీలు కాదు హాఫ్‌ గ్యారెంటీలు మాదిరి ప్రభుత్వం అయిపోయిందని కేటీఆర్‌ చెప్పారు.

దేశంలో పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పారు. 50 లక్షల రూపాయల బ్యాగుతో పట్టుబడిన రేవంత్‌ రెడ్డిని దొంగ అనకుంటే ఏమంటారనీ, డబ్బుల కట్టలతో సభ్యులను కొనాలనుకున్న రేవంత్‌ రెడ్డిపై అందుకే కేసు పెట్టాల్సి వచ్చిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

రాజ్యాంగం విలువల గురించి ఢిల్లీలో గోల చేసే రాహుల్‌ గాంధీ.. తెలంగాణలో మాత్రం మౌనంగా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. మొహబ్బత్‌కి దుకాణ్‌ అని చెప్తున్న రాహుల్‌ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న బుల్డోజర్‌ రాజ్యం గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ బుల్డోజర్ల నుంచి పేద ప్రజలను కాపాడటంపై రాహుల్‌ గాంధీ దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

అప్పుడు కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకున్నాం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అంచనాలు పెరగడం మా ఓటమికి ఉపకారమే అయిందన్నారు. మేం ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా ఇచ్చినప్పటికీ ఆ విషయాన్ని ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన పార్టీని తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌లో నాడు విలీనం చేయాలనుకున్నాం.. కానీ కాంగ్రెస్‌ పార్టీ వల్లే విలీనం జరగలేదని స్పష్టం చేశారు.

అదృష్టవశాత్తు తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అవకాశం కేసీఆర్‌కు దొరకడంతో పది సంవత్సరాల్లో ఐటీ రంగం నుంచి వ్యవసాయ రంగం దాకా అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్న్రి అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలో ఉన్న మేము ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో, వారి ఆకాంక్షల కోసం పోరాటం చేయడంలో సంతృప్తిగా సంతోషంగా ఉన్నామన్నారు.

రాజకీయాల్లో గెలుపు ఓటముల పట్ల చలించిపోయే తత్వం కేసీఆర్‌ది కాదు. ఆయన బలమైన మనస్తత్వం, వ్యక్తిత్వం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసింది. కేసీఆర్‌ నిరంతరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. తెలంగాణ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.

కానీ అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేసిన పార్టీ తీరుపైనా, ఆ పార్టీ పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన కేసీఆర్‌ ఆవేదన చెందుతున్నారు. కచ్చితంగా ప్రజలు మరోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇస్తారని విశ్వసిస్తున్నాం.

హైదరాబాద్‌ నగరంలో జరిగిన అభివృద్ధికి, రాష్ట్ర ప్రగతికి ప్రజలు పట్టం కట్టారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కూడా అద్భుతమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతాంగానికి రైతుబంధు, రైతుబీమాతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశాం.

200 రూపాయలు ఉన్న ఆసరా పెన్షన్లను 2 వేల రూపాయలకు పెంచాం. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు అన్నీ చేస్తామని చెప్పి ఆశ పెట్టింది. గ్రామీణ, నగర ప్రాంతాలు అన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలో సమగ్రంగా, సమాంతరంగా అభివృద్ధి చెందాయి. గత పది సంవత్సరాల్లో అభివృద్ధి, ప్రభుత్వ పాలనపైనే ప్రధానంగా దృష్టి సారించాం.

వాటిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరంఉందని కేటీఆర్‌ చెప్పారు. ప్రస్తుతం పార్టీకి రెండున్నర దశాబ్దాలుగా నిర్మించుకున్న నాయకత్వం ఉంది. అన్ని గ్రామాల్లో ధృడమైన పార్టీ నిర్మాణం చెక్కుచెదరకుండా ఉంది.ఒక్క ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో పార్టీకి వచ్చినఇబ్బంది లేదని రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement