నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం తుమ్మల కుంట తండాలో ఓ వివాహిత మహిళతో కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నేరాలను అదుపు చేయాల్సిన పోలీసే దారి తప్పి గ్రామస్తులకు అడ్డంగా దొరికిపోయాడు. రోజుల తరబడి జరుగుతున్న ఈ తతంగాన్ని ఇన్నాళ్లు చూసిచూడనట్టుగా వదిలేసిన స్థానికులు.. సహనం నశించి కానిస్టేబుల్కు దేహశుద్ధి చేశారు.
వెల్దండ పీఎస్లో పనిచేసే కానిస్టేబుల్.. తుమ్మలకుంట తండాకు చెందిన మహిళతో చాలా రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తొలుత గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారం.. ఆ కంట, ఈ కంట పడి గ్రామస్తులందరికీ తెలిసిపోయింది. ఈ క్రమంలో రెండు రోజులు క్రితం రాత్రిపూట కానిస్టేబుల్ మహిళ ఇంట్లోకి వెళ్లగానే.. బయటి నుంచి స్థానికులు గడియ పెట్టారు. అది గ్రహించిన కానిస్టేబుల్ తోటి కానిస్టేబుళ్లకు సమాచారం అందించి.. తనను కాపాడాలని కోరాడు. దీంతో పెట్రోలింగ్ పేరుతో వారు తండాకు వచ్చారు. ఇంట్లో ఉన్న కానిస్టేబుల్ విడిపించుకుని వెళ్తుండగా.. గ్రామ యువకులు అడ్డుకుని అందరినీ చితకబాదారు. పోలీసుగా ఉండి పాడు పని ఏమిటని దేహశుద్ధి చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు బయటకి పొక్కకుండా గోప్యంగా ఉంచారు. కానీ కానిస్టేబుళ్లను చితకబాదిన దృశ్యాలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అసలు కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.