Sunday, November 17, 2024

Big Story | రైతులకు పెన్షన్‌.. బీఆర్ఎస్‌ బ్రహ్మాస్త్రాల్లో అన్నదాత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో పాటు ఎన్నికల ప్రచార అంశాలు మారుతున్నాయి. ఓటర్లే కీలకంగా అస్త్రాలను పార్టీలు వదులుతున్నాయి. తెలంగాణలో రానున్న అసెంబ్లిd ఎన్నికల్లో రైతులే ప్రధానాంశంగా ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ రైతులను ఆకట్టుకునేందుకు గ్యారెంటీలను ప్రకటించింది. అధికార భారాస రైతు బంధు ఇచ్చి గత ఎన్నికల్లో అన్నదాతల ఓట్లను వెన్నెముఖగా చేసుకొంది.

గంప గుత్తుగా ఓట్లను కొల్లగొట్టింది. ఇప్పుడు వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో మళ్లి రైతుల ఓట్లు భారాసకు చెక్కు చెదరకుండా ఉండేలా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా దేశంలో ఎవరూ చేయలేని కొత్త తరహా స్కీమ్‌లను తీసుకువచ్చేలా మేనిఫెస్టోను సిద్ధం చేసింది. రైతులకు పెన్షన్‌లు ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా దేశ వ్యాప్తంగా డిమాండ్‌ ఉండేది. ఏ ప్రభుత్వాలు దీన్ని అమలు చేసే సహసం చేయలేదు.

- Advertisement -

కనీసం రైతు బంధు కూడా ఎక్కడా ఇవ్వలేదు. భారాస సర్కార్‌ పెట్టుబడి సాయంగా ఇచ్చిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని తీసుకువచ్చింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ తాము చేసింది.. దేశం అనుసరిస్తోంది అంటూ చెబుతోంది. కొత్త తరహా వాటికే అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఈ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడ్‌ అయ్యేలా రైతులకు పెన్షన్‌లను అమలు చేసే హామీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

చెరగని ముద్ర.. కేసీఆర్‌ మార్క్‌

భారాస ఎన్నికల అస్త్రాల్లో ప్రధానంగా రైతులే ఉండనున్నారు. అసెంబ్లి ఎన్నికల్లో గెలవాలంటే అధిక శాతం ఉన్న రైతులను అక్కున చేర్చుకుంటేనే సాధ్యమని అధినేత కేసీఆర్‌ బావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కుల, మతాలకు అతీతంగా ముందుకు సాగాలంటే ఇలాంటి పాలన అయితేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పెన్షన్‌లను అమలు చేసి దేశ చరిత్రలోనే రికార్డ్‌ క్రియేట్‌ చేయాలన్న పట్టుదలతో అధినేత కేసీఆర్‌ ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో రెండు రూపాయిలకి కిలో రేషన్‌ బియ్యం పథకాన్ని తీసుకువచ్చి ఎన్టీఆర్‌ చరిత్ర సృష్టించారు. ఇప్పటికి అది చెరగని ముద్రనే. అలానే కేసీఆర్‌ అంటే మార్క్‌ ఉండేలా భారాస ఎత్తులు వేస్తోంది.

పెన్షన్‌తో రికార్డ్‌ క్రియేట్‌

రైతులకు పెన్షన్‌లను తీసుకువచ్చిన మొట్టమొదటి పార్టీగా భారాస నిలువాలని అధిష్టానం బావిస్తోంది. రూ.3000 నుంచి రూ.5000 వరకు ఇచ్చే ఆలోచనలను అధినేత కేసీఆర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు ప్రత్యేకంగా సమావేశం అయి చర్చలు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి.

దీనిపై భారాస అధిష్టానం పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు మా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి, బ్రహాండ్లమైన పథకాలు వస్తాయి అంటూ నిత్యం ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో రైతులకు పెన్షన్‌ అనే అంశం తెరపైకి వస్తోంది. అక్టోబర్‌ 16న వరంగల్‌ వేదికగా అధినేత కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement