Friday, January 10, 2025

TG | ‘ఉపాధి’ ఉద్యోగులకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని : సీఎం రేవంత్‌

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.

ఈ సంద‌ర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న వారందరికీ ప్రతి నెలా గ్రీన్ చానెల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని, వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని చెప్పారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఉపాధి హామీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.

ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement