అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పోలీసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులకు రావాల్సిన భత్యాలకు సంబంధించిన ఫైల్‌కు ఆర్ధిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర పోలీసుశాఖలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, సిబ్బంది కుటుంబాల్లో ఆనందం నెలకొంది. పోలీస్ సిబ్బంది ట్రావెలింగ్ అలవెన్స్ (టీ-ఏ)లు, పోలీస్ ఉద్యోగుల జీపీఎఫ్ లోన్‌లను క్లియర్ చేసింది. పోలీసు శాఖలోని ఉద్యోగులు, సిబ్బంది చాలాకాలంగా తమ అవసరాల కోసం చీపీఎఫ్ లోన్‌లకు అప్లై చేసుకుని అవి మంజూరు కాకపోవడంతో నిరాశలో ఉన్నారు. అదేవిధంగా టీఏలకు సంబంధించి పెడింగ్ నిధులు విడుదలకు నోచుకోక అసంతృప్తితో ఉన్నారు. వీటికి సంబంధించి ఉద్యోగులు, సిబ్బంది అనేకమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. పోలీసు అధికారుల సంఘం నిత్యం ఈ విషయంలో పోరాడుతూనే ఉంది.
పలుమార్లు డీజీపీ కెవి రాజేంద్రనాధ్ రెడ్డి హోంశాఖ ద్వారా ప్రతిపాదనలు సిధ్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎట్టకేలకు స్పందించిన జగన్ సర్కార్ పోలీసులకు పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంతో శుక్రవారం రాష్ట్రంలోని పోలీసుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. ప్రభుత్వం సానుకూల నిర్ణయంతో టీఏ, జీపీఎఫ్ లోన్ల బకాయిలు తీరగా.. సరెండర్ లీవ్స్ మాత్రం ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉన్నట్లు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం పేర్కొంది. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి ఏడాది నవంబర్‌లో లభించే సరెండర్ లీవ్‌తోపాటు, పోలీసులకు అదనంగా ప్రతి జనవరిలో ఒక అదనపు సరెండర్ లీవ్, ప్రతీ జూలైలో మరొక అదనపు సరెండర్ లీవ్ కలిపి మూడు సరెండర్ లీవ్‌లు ప్రస్తుతం చెల్లించాల్సి ఉంది.
గత ఏడాది జనవరిలో రావాల్సిన సరెండర్ లీవ్స్ ప్రభుత్వం అప్పుడే క్లియర్ చేసింది. తాజాగా టీఏ, జీపీఎఫ్ బకాయిలు మంజూరు చేసిన ప్రభుత్వం త్వరలో సరెండర్ లీవ్స్ కూడా మంజూరు చేయాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. కాగా బకాయిల విడుదల పట్ల పోలీస్ అధికారుల సంఘం తరుఫున హర్షం వ్యక్తం చేశారు. కృషి చేసిన డీజీపీ కెవి రాజేంద్రనాధ్ రెడ్డి కి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేశారు.