ముంబై – ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి షాక్ ఇచ్చింది. భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ భారీ జరిమానా విధించింది. ఎయిర్ ఇండియా ఉద్యోగి నుంచి అందిన ఫిర్యాదు మేరకు డీజీసీఏ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు రూ.1.10 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. నిర్దిష్ట సుదూర ప్రాంత క్లిష్టమైన మార్గాల్లో నిర్వహించే విమానాల విషయంలో ఎయిర్ ఇండియా సంస్థ భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆ సంస్థలోని ఓ ఉద్యోగి ఫిర్యాదు అందించినట్లు డీజీసీఏ తెలిపింది.
ఆ ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు సంస్థకు భారీ జరిమానా విధించినట్లు స్పష్టం చేసింది. కాగా, ఎయిర్ ఇండియాకు డీజీసీఏ జరిమానా విధించడం వారంలో ఇది రెండోసారి. గత గురువారం కూడా ఎయిర్ ఇండియా సంస్థకు డీజీసీఏ ఫైన్ వేసింది. పైలట్ల రోస్టరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా వేసింది.