Friday, November 22, 2024

మృత్యువుతో పోరాడుతున్న పీలే.. ఆస్పత్రిలోనే క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్న కుటుంబసభ్యులు

ఫుట్‌ బాల్‌ ఆల్‌ టైం గ్రేట్‌ పీలే ఆరోగ్యం మరింతగా విషమించింది. గొప్ప బ్రెజిలియన్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా పేరు గాంచిన పీలే ప్రస్తుతం సావో పాలో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. వైద్యులు ఆయనను ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. అతని ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తున్నదని, ఇది మూత్ర పిండాలు, గుండెపై ప్రభావం చూపుతున్నదని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న 82 ఏళ్ల వెటరన్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిని చూసేందుకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు క్రిస్మస్‌ వేడుకలను హాస్పిటల్‌లోనే జరుపుకున్నారు.

ఆదివారం పీలే కుమార్తె కెల్లి నాసిమెంటో ఇన్‌స్టాలో ఓ ఫోటోను పోస్ట్‌ చేసింది. “క్రిస్మస్‌ సందర్బంగా తమ తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమకు ధన్యవాదాలు. ఈ ఆహ్లాదకరమైన, అద్భుతమైన జీవితంలో పీలే లేకుండా నేను ఏమీ కాదు” అని నాసిమెంటో పోస్టులో రాశారు. ఇదే సమయంలో పీలే కుమారుడు ఎడిన్హో ఇన్‌స్టాగ్రామ్‌లో భావో ద్వేగంతో పోస్ట్‌ పెట్టాడు. “పాపా… నువ్వే నా బలం” అంటూ తండ్రితో ఉన్న చిన్న నాటి ఫోటోను షేర్‌ చేశాడు. ఈయన శనివారం ఆస్పత్రికి చేరుకోగా కుమార్తె కెల్లి నాసిమెంటో ఇప్పటికే హాస్పిటల్‌లో ఉన్నారు.

రొటీన్‌ చెకప్‌కోసం పీలే ఆస్పత్రికి చేరిన క్రమంలో ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. పీలేకు గుండె సంబంధ సమస్యలు ఉన్నాయి. కీమో థెరపీ చికిత్సకు స్పందించకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పేగు కణితిని గత ఏడాది సెప్టెంబర్‌లో తొలగించారు. ఆ తర్వాత అతడికి కీమో థెరపీ జరిగింది. గతంలో పీలే చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యాడు.
ఫిఫా ప్రపంచకప్‌ ప్రారంభం సందర్భంగా పీలే తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో ఒక ఫోటోను పోస్ట్‌ చేసి.. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement