న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదుడు పి.వి నరసింహారావు జయంతి వేడుకలను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం పీవీ 101వ జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం. సాహ్ని, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ విక్రమ్‌మాన్ సింగ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పీవీ నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ పీవీ భారత రాజకీయాల్లో అసలుసిసలైన రాజకీయ చాణక్యుడని, క్లిష్ట కాలంలో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.
పీవీ శతజయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించిందని తెలిపారు. అనంతరం కె.ఎం సాహ్ని మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి, పేదరికం పెరిగిపోయి, కష్టకాలంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారని అన్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకురావడమే కాకుండా, ప్రజల్లో భద్రత, నమ్మకం కల్పించడంలో ఎంతో కృషి చేశారని కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా, గొప్పవ్యూహకర్తగా, అపర చాణక్యుడిగా పేరు గడించిన పీవీ నరసింహారావు జయంతిని దేశ రాజధానిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.