Tuesday, November 26, 2024

టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

ఇటీవల బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ జాబితాలో పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, హుజురాబాద్ నేత స్వర్గం రవి ఉన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం నచ్చకే పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు.

కాగా పెద్దిరెడ్డి చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రజాసంక్షేమంలో భాగస్వాములు కావడానికే పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కేసీఆర్ అన్నారు. పెద్దిరెడ్డి తనకు సన్నిహిత మిత్రుడు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేశానన్నారు. రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో పెద్దిరెడ్డి తనకు చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం చివర్లో తూతూమంత్రంగా వచ్చినోళ్లు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ వచ్చిన కొత్తలో తాను కార్లకు రంగులు మార్చడంపై పలువురికి సందేహాలు వచ్చాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఏపీ సీఎం వాడిన నల్లకార్లను తనకు ఇచ్చారని.. కానీ తనకు నల్లరంగు నచ్చదన్నారు. అందుకే నల్ల కార్లకు తెల్లరంగులు వేయించామన్నారు. ఈ విషయం గవర్నర్ నరసింహన్ తనను అడిగారని, కొత్త కార్లు కొనుక్కోవచ్చు కదా అని అన్నారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు మంచిగా అమలు చేస్తున్నామని.. పథకాలు అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. చేనేత కార్మికులకు రైతు బీమా తరహాలో సహాయం అందిస్తామన్నారు. దేశ జీడీపీ కన్నా తెలంగాణ జీఎస్‌డీపీ చాలా ఎక్కువన్నారు. కరోనా వల్ల దళిత బంధు పథకం అమలు చేయడం ఏడాది ఆలస్యమైందన్నారు. ఆరునూరైనా దళిత బంధు ఆగదన్నారు.

ఈ వార్త కూడా చదవండి: దళిత బంధు పథకంపై హైకోర్టులో పిటిషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement