Home తెలంగాణ‌ కరీంనగర్ Peddapalli – ఉత్తమ పంచాయతీగా చిల్లపల్లి – రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన కలెక్టర్

Peddapalli – ఉత్తమ పంచాయతీగా చిల్లపల్లి – రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన కలెక్టర్

0
Peddapalli  – ఉత్తమ పంచాయతీగా  చిల్లపల్లి –   రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు  స్వీకరించిన కలెక్టర్

పెద్దపల్లిరూరల్, (ఆంధ్రప్రభ): మంథని మండలం చిల్లపల్లి గ్రామానికి వచ్చిన జాతీయ పంచాయతీ అవార్డును జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. ఢిల్లీలో నిర్వహించిన జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు.

2022-23 వ సంవత్సరంలో మహిళా ఫ్రెండ్లీ పంచాయతీలలో దేశంలోనే మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. గ్రామంలోని ఆరు సంవత్సరాల పిల్లలందరినీ ఐసిడిఎస్ లో రిజిస్టర్ చేయడం, గ్రామ సభలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం, స్వశక్తి మహిళా సంఘాలకు రుణాలు అందడం, మాతా శిశు మరణాలు సున్నాకు తగ్గడం, బాలికల విద్య ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు అమలు చేసినందుకు చిల్లపల్లి గ్రామం ఉత్తమ గ్రామం ఎంపికైంది.

ఉత్తమ మహిళా ఫ్రెండ్లీ గ్రామంగా ఎంపికైన చల్లపల్లి గ్రామానికి 65 లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చిందని, ఈ నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో ఇదే రీతిలో మహిళల అభ్యున్నతి కొరకు గ్రామంలో పనులు జరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ వీర బుచ్చయ్య, జడ్పీ సీఈవో నరేందర్, డిఆర్డిఓ రవీందర్, డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్ కుమార్, ఎంపిడిఓ పూర్ణ చందర్ రావు, మండల పంచాయతీ అధికారి శేషా సూరి, డిపిఎం రజాక్, పంచాయతీ కార్యదర్శి రాం కిషోర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version