Saturday, September 7, 2024

TG: భారీ వరదకు కొట్టుకుపోయిన పెదవాగు ప్రాజెక్టు…

70శాతంకు పైగా కొట్టుకుపోయిన ఆనకట్ట
ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకమే
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీలు

అశ్వారావుపేట, జులై 19(ప్రభ న్యూస్): మండలంలోని గుమ్మడివల్లి గ్రామంలోని బహుళార్థ సార్ధక ప్రాజెక్టు అయిన పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా ఖతమయ్యే పరిస్థితి నెలకొంది. గడచిన రెండు రోజులుగా మండల వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవడంతో వరద నీరు ప్రాజెక్టుకు సామర్థ్యానికి మించి చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో సామర్థ్యం 45వేల క్యూసెక్కులు కాగా, గురువారం రాత్రి తొమ్మిది గంటలకు 70వేల క్యూసెక్కులకు పైగా నీరు ప్రాజెక్టుకు చేరడంతో ప్రాజెక్టులోని 70% పైగా ఆనకట్ట కొట్టుకుపోయి దిగువ ప్రాంతానికి వరద నీరు చేరుకుంది.

దీంతో దిగువన ఉన్న కొత్తూరు, రంగాపురం, ఆంధ్రాలోని మేడేపల్లి, కమ్మరిగూడెం, రామవరం గ్రామాలు నీట మునిగాయి. ఈ సందర్భంగా వరదలో వందలాది జీవాలు కూడా కొట్టుకుపోవటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే పలు వాహనాలు కూడా వరద దాటికి కొట్టుకుపోవడంతో వాహనాల కోసం వాహనదారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం సాయంత్రం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సంఘటన స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో ముంపునకు గురయ్యే గ్రామాల బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

బాధిత గ్రామాల్లో ఈరోజు ఉదయం స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు లు పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి వారికి కావలసిన తక్షణ సాయాన్ని అందించాల్సిందిగా స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement