కాకినాడ, ఆంధ్రప్రభ : అమలాపురంలో మంగళవారం విధ్వంసకాండకు పాల్పడిన వారిపై పోలీసులు పీడీపీపీ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, హత్యాయత్నం, కుట్ర వంటి కేసులకు ఇది అదనం. ఈ చట్టం మేరకు విధ్వంసంలో జరిగిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నష్టం విలువను నిందితుల వ్యక్తిగత ఆస్తుల్నుంచి జమ చేసుకుంటారు. అనుమానితులు మరో 25మందిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు అధికారికంగా చూపిన అరెస్టుల సంఖ్య 71కి చేరింది. వీరందరికీ అమలాపురంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తిగత ఆస్తుల వివరాల్ని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల సహాయంతో సేకిస్తున్నారు. పిడిపిపి యాక్ట్ క్రింద వీరిపై కేసులు పెట్టడంతో ఈ ఆస్తులన్నింటిని కోర్టు వెంటనే స్థంభింపజేస్తుంది. వీటిపై క్రయవిక్రయాలకు, పేరు మార్పిడిలకు ఇక ఏమాత్రం అవకాశముండదు. వీరి నేరం రుజువైన వెంటనే విధ్వంసంలో జరిగిన నష్టానికి సరిపడే స్థాయిలో వీరందర్నుంచి వ్యక్తిగత ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటుంది. మరో వైపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బి ఇంజనీర్లు నష్టాల అంచనాల్ని మొదలెట్టారు. దుండగులు దగ్ధం చేసిన పోలీసుల వజ్రాజీపు, రెండు ఆర్‌టిసి బస్సులు, ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల్తో పాటు మంత్రి విశ్వరూప్‌కు చెందిన రెండు ఇళ్ళు, వాటిలోని ఫర్నిచర్, ఆవరణలోదగ్ధమైన వాహనాలు, అలాగే ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు లోపలి ఫర్నిచర్ నుంచి ధ్వంసం, దగ్ధాలకు గురైన ప్రతి వస్తువు విలువను అంచనా కడుతున్నారు. ఈ మొత్తాన్ని పిడిపిపి చట్టం మేరకు నేరం రుజువైన ముద్దాయిల నుంచి రాబడతారు. ఈకేసు తేలేవరకు అనుమానితుల పేరిట ఉన్న ఆస్తులన్నీ కోర్టు అధీనంలోనే ఉంటాయి. వీటిపై అనుమానితులెవరికూ కేసు తేలే వరకు ఎలాంటి హక్కుభుక్తాలుండవు. ఆస్తుల్లోకి ప్రవేశించేందుక్కూడా వారికి అనుమతి ఉండదు. దుండగులపై ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని ప్రయోగించడం ఈ ప్రాంతంలో ఇదే తొలిసారి. తద్వారా చీటికి మాటికి ఆందోళనలు, ఉద్యమాలంటూ ఆర్‌టిసి బస్సుల్ని, ప్రభుత్వ కార్యాలయాల్ని, ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తూ దగ్ధాలకు పాల్పడుతున్న దుండగులందరికీ ఇదొక హెచ్చరిక కానుంది.
ఇదిలా ఉంటే కోనసీమ వ్యాప్తంగా శనివారం కూడా ఇంటర్‌నెట్ సేవలు స్థంభించాయి. ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయాయి. ఎటిఎమ్‌లు, ఆన్‌లైన్ పేమెంట్‌లు సాగలేదు. అమలాపురంలో నెమ్మదిగా సాధారణ పరిస్థితి నెలకొంటోంది. వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. మార్కెట్లు యదావిధిగా పని చేస్తున్నాయి. అయితే నెట్ సౌలభ్యం లేక సమాచార మార్పిడికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సోమవారం వరకు ఇంటర్‌నెట్ పునరుద్దరణ జరగదని పోలీస్ అధికారులు వెల్లడించారు. తిరిగి ఆందోళనలు రెచ్చగొట్టే ప్రమాదాన్ని నివారించేందుకే ఈ చర్యలు చేపట్టామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..