Friday, November 22, 2024

జూన్ 1, 2 తేదీల్లో పీసీసీ చింతన్‌ శిబిర్ .. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను ఆమోదించనున్న తెలంగాణ కాంగ్రెస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ జూన్‌ 1, 2 తేదీల్లో మేధోమథనం నిర్వహించనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కు టీ పీసీసీ ఆమోదం తెలపనుంది. ఈ మేధో మథనం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జూన్‌ 1, 2 తేదీల్లో నిర్వహించాలని కాంగ్రెస్‌ అధిష్టానం సూచించింది. అయితే టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికాలోని టాటా సభలకు వెళ్లడంతో.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి టీ పీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, పార్టీ అనుంబంధ సంఘాల చైర్మన్లు, వివిధ కమిటీల చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు డీసీసీసీ అధ్యక్షులు కలిపి మొత్తం 150 మంది వరకు హాజరయ్యే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీని క్షేత్ర స్థాయికి తీసకెళ్లే విధంగా చేపట్టాల్సిన అంశాలు, ప్రజా సమస్యలపై స్పందించాల్సిన తీరు, పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో మహిలకు 50 శాతం వాటా ఉండేలా అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై చర్చించనున్నారు. వీటితో పాటు ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అంశాలు, వ్యవసాయం, ఆర్థిక అంశాలు, మహిళా శిశు సంక్షేమం తదితర విషయాలపైన చర్చించి ఆమోదించనున్నారు.

రాష్ట్ర నవసంకల్ప శిబిర్‌ చైర్మన్‌గా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..

ఉదయ్‌పూర్‌ ( చింతన్‌ శిబిర్‌ ) డిక్లరేషన్‌ను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు గాను రాష్ట్రంలో ‘ నవ సంకల్ప శిబిర్‌ ‘ కమిటీ ని 33 మందితో ఏఐసీసీ ఆదేశాల మేరకు టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ ఆదివారం ప్రకటించారు. అంతకు ముందు గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కంగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరై చింతన్‌ శిబిర్‌ సమావేశంపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కమిటీ వేయాలని నిర్ణయించారు.

కాగా, ఈ నవ సంకల్ప శిబిర్‌ కమిటీకి చైర్మన్‌గా సీఎల్పీ నేత భట్టి విక్రమాక్క, కన్వీనర్‌గా ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి వ్యవహారించనున్నారు. మిగతా సభ్యులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టి. జీవన్‌రెడ్డి, అజారుద్దీన్‌, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌, శ్రీధర్‌బాబు, పొడెం వీరయ్య, షబ్బీర్‌అలీ, మర్రి శశిధర్‌రెడ్డి, రామిరెడ్డి దామోదర్‌రెడ్డి, గడ్డం వినోద్‌, దాసోజ్‌ శ్రావణ్‌, కోదండరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జెట్టి కుసుమ కుమార్‌, వేం నరేందర్‌రెడ్డి, జి. నిరంజన్‌, రామ్మోహన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మంచిర్యాల జడ్పీ చైర్మన్‌ భాగ్యలక్ష్మి, నందికంటి శ్రీధర్‌, అంజతుల్లా హుస్సేనీ, సుధీర్‌రెడ్డి, హరివర్దన్‌రెడ్డి, రాచమల్ల సిద్ధేశ్వర్‌, గాలి అనిల్‌కుమార్‌, జంగయ్య యాదవ్‌తో పాటు పార్టీ అనుంబంధ సంఘాల చైర్మన్లు, ఆఫీస్‌ బేరర్స్‌ను ఈ కమిటీలో నియమించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement