పేటీఎం తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు భారత్‌లోనే అతిపెద్ద ఐపీవో దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా రూ.16,600 కోట్ల పెట్టుబడులు ఆహ్వానించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. రూ.8,300 కోట్ల షేర్లను మార్కెట్లో పెట్టడంతో పాటు కొత్తగా రూ.8,300 విలువైన తాజా షేర్లను పేటీఎం ఇష్యూ చేయనుంది. ఇలా మొత్తం రూ.16,600 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకునేందుకు ఐపీవో బాటపట్టింది. ఈ నెల 12న జరిగిన వన్ 97 కమ్యూనికేషన్స్ సమావేశంలో షేర్హోల్డర్లు ఐపీవోకు అంగీకరించారు. ఈ మేరకు తమ షేర్లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని సెబీకి పేటీఎం దరఖాస్తు పెట్టుకుంది.
జేపీ మోర్గాన్ చేస్, మోర్గాన్ స్టాన్లీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, గోల్డ్‌మన్ సచ్స్, యాక్సిక్ క్యాపిటల్, సిటీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేటీఎం ఐపీవోకు బుకింగ్ రన్నింగ్ మేనేజర్స్‌గా ఉండనున్నాయి. వన్ 97 కమ్యూనికేషన్స్ సొంతం చేసుకున్న పేటీఎంలో బెర్క్‌షైర్ హాత్వే, చైనాకు చెందిన యాంట్ గ్రూప్, జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ కంపెనీల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ప్రి ఐపీవోల భాగంగా ఆలిబాబ్.కామ్ కూడా 7.2శాతం షేర్లు దక్కించుకోనుంది. కాగా మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి వన్ 97 కమ్యూనికేషన్స్ సంస్థ రూ.1696 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఏడాది పేటీఎం రూ.2,420 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
ఈ వార్త కూడా చదవండి: ట్విట్టర్‌లో ఇకపై డిస్‌లైక్ బటన్