యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాలంటే అవతలి వ్యక్తి యూపీఐ ఐడీ తెలిసి ఉండాలి. ఒక వేళ ఫోన్ నెంబర్ ఆధారంగా డబ్బులు పంపించాలంటే అదే యాప్‌ను మనమూ ఉపయోగిస్తుండాలి. ఒకరి వద్ద ఉన్న యాప్ వేరే వారి వద్ద లేనప్పుడు , ఇద్దరూ ఒకే యాప్‌ను ఉపయోగించకుంటే చెల్లింపులు చేయడం సాధ్యంకాదు. ఇప్పుడు ఈ సమస్యను అధిగమించినట్లు పేటీఎం ప్రకటించింది. మొబైల్ నెంబర్ ఆధారంగా ఇతర యూపీఐ యాప్స్‌కు డబ్బులు పంపించవచ్చని పేటీఎం తెలిపింది. అవతలివారు పేటీఎంలో రిజిస్టర్ కాకపోయినప్పటికీ పేమెంట్ చేయడం సాధ్యమేనని పేర్కొంది.
యూపీఐ పేమెంట్స్‌కు సంబంధించి తమ యూనివర్సల్ డేటాను పరస్పరం పంచుకోవాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)సర్వీస్ ప్రొవైడర్లకు సూచించింది. దీని వల్ల ఏ యాప్ వినియోగదారులైనా ఇతర యూపీఐ యాప్ కలిగిన వ్యక్తులకు లావాదేవీలు చేయవచ్చు. ఫలానా యూపీఐ యాప్ ద్వారానే పేమెంట్స్ చేయాల్సిన అవసరంలేదు. ఈ నేపథ్యంలోనే పేటీఎం కొత్త సదుపాయాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. ఈ సేవలను పొందాలంటే పేటీఎం యాప్‌లోని యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ సెక్షన్‌కు వెళితే టు యూపీఐ యాప్స్ అనే సెక్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఏ యూపీఐ యాప్‌కైనా చెల్లింపులు చేయవచ్చు.