Friday, November 22, 2024

మారటోరియం కాలంలో రుణఖాతాలకు వడ్డీ పరిహారం చెల్లింపు..

కరోనా మొదటి లాక్‌డౌన్ సందర్భంగా రుణాలపై విధించిన మారటోరియం సమయంలో నిర్దిష్ట రుణ ఖాతాల్లో రుణగ్రహీతలకు 6 నెలల పాటు చక్రవడ్డీ, సరళ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని పరిహారం కింద చెల్లించే పథకానికి అదనంగా నిధులు కేటాయిస్తూ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, గతంలో మంజూరు చేసిన రూ. 5,500 కోట్లకు అదనంగా మరో రూ. 973.74 కోట్లు ఈ పథకం కోసం కేటాయిస్తూ ఆమోదముద్ర వేసింది. తద్వారా నిర్దిష్ట రుణ ఖాతాల్లోని రుణగ్రహీతలకు 6 నెలల పాటు (2020 మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు) చక్రవడ్డీ, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని లెక్కగట్టి కేంద్రం చెల్లించనుంది. రుణగ్రహీత మారటోరియంను పొందారా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా, ఆరు నెలల మారటోరియం వ్యవధిలో చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసానికి పరిహారం కింద కేంద్రం చెల్లించడం వల్ల రుణగ్రహీతలపై అదనపు వడ్డీభారం తొలగిపోనుంది. ఫలితంగా ఈ పథకం చిన్న రుణగ్రహీతలకు మహమ్మారి కారణంగా ఎదురైన సమస్యలను అధిగమించి తిరిగి నిలదొక్కుకోవడానికి సహాయపడుతుందని కేంద్రం తెలిపింది. ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదంతో జారీ అయ్యాయి.

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో, నిర్దిష్ట రుణ ఖాతాల్లో రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు చక్రవడ్డీ, సరళ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని మంజూరు చేసే పథకాన్ని అక్టోబర్, 2020లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది, ఇందుకోసం రూ. 5,500 కోట్ల పెట్టుబడి అవుతుందని అంచనా వేస్తూ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దిగువ పేర్కొన్న రుణగ్రహీతలు ఎక్స్ గ్రేషియా (పరిహారం) చెల్లింపునకు అర్హులు.

రూ. 2 కోట్ల వరకు ఎంఎస్ఎంఈ రుణాలు
రూ.2 కోట్ల వరకు విద్యా రుణాలు
రూ.2 కోట్ల వరకు గృహ రుణాలు
రూ.2 కోట్ల వరకు కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు
రూ.2 కోట్ల వరకు క్రెడిట్ కార్డు బకాయిలు
రూ.2 కోట్ల వరకు వాహన రుణాలు
రూ. 2 కోట్ల వరకు వృత్తి నిపుణులకు వ్యక్తిగత రుణాలు
రూ. 2 కోట్ల వరకు వినియోగ రుణాలు

2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.5,500 కోట్ల బడ్జెట్ కేటాయించగా, క్యాబినెట్ ఆమోదంతో రూ.5,500 కోట్ల మొత్తాన్ని ఈ పథకం కింద నోడల్ ఏజెన్సీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్రం విడుదల చేసింది. ప్రీ ఆడిట్ అంచనాలతో లెక్కించగా రూ. 5,500 కోట్లు రాగా, వాస్తవ గణాంకాలను లెక్కించినప్పుడు రూ.6,473.74 కోట్ల మేర క్లెయింలు ఉన్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో ఇప్పటికే విడుదల చేసిన రూ. రూ.5,500 కోట్లకు అదనంగా మిగతా మొత్తం రూ.973.74 కోట్లు విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement