ఒకే ర్యాంకు.. ఒకే పెన్షన్ కింద మాజీ సైనికులకు చెల్లించాల్సిన బకాయిలను మార్చి 15లోగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం సూచించింది. గతేడాది ఈ పథకాన్ని సమర్ధిస్తూ ఇచ్చిన తీర్పును పాటించాలని సీజేఐడీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కోరింది. కాగా, ఇప్పటికే 25 లక్షల మంది మాజీ సైనికులకు ఓఆర్‌ఓపీ పింఛను అందజేయడం జరిగిందని కేంద్రం బదులిచ్చింది. ఇండియన్ ఎక్స్ సర్వీస్‌మెన్ మూవ్‌మెంట్ తరఫున సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ, న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదించగా, కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదనలు వినిపించారు.
2015 నవంబర్ 7 నాటి ప్రభుత్వ ప్రకటన నిర్వచించిన విధంగా ఓఆర్‌ఓపీ సూత్రంలో రాజ్యాంగపరమైన బలహీనత లేదనికోర్టు గుర్తించింది. 2014 జులై 1 కటాఫ్ తేదీ నుంచి పెన్షనర్లకు ప్రయోజనాలు అమలులోకి వస్తాయని ఓఆర్‌ఓపీ పథకం నిర్దేశించింది. గత పింఛనుదారుల పెన్షన్లు 2013 క్యాలెండర్ సంవత్సరంలో పదవీ విరమణ చేసిన వారి పెన్షన్ల ఆధారంగా తిరిగి నిర్ణయించబడతాయని పేర్కొంది. ఈ పథకం ఆర్థికపరమైన చిక్కులను పరిశీలించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.