పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం భవదీయుడు భగత్ సింగ్ చిత్రం పేరు మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు.ఈ చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆదివారం ఉదయం 11.45 గంటలకు పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు, పలువురు ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వి.వి. వినాయక్, కె.దశరథ్, మలినేని గోపీచంద్, బుచ్చిబాబు, నిర్మాతలు ఎ.ఎం. రత్నం, దిల్ రాజు, శిరీష్, విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి, రామ్ ఆచంట, గోపి ఆచంట, కిలారు సతీష్ హాజరయ్యారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, ఎ.ఎం. రత్నం కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్ కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు.
రామ్ ఆచంట, విశ్వప్రసాద్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందించారు. ఉస్తాద్ భగత్ సింగ్’ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈరోజు చిత్ర ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. తెల్లటి ఓవర్‌కోట్ ధరించి, హార్లే డేవిడ్సన్ బైక్ పక్కన, టీ గ్లాస్ పట్టుకుని నిల్చొని ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రాకను సూచించే గాలిమర, టవర్ మరియు మెరుపులను గమనించవచ్చు. అలాగే పోస్టర్ లో ‘ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు’, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే క్యాప్షన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.