Sunday, September 8, 2024

Delhi | జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ.. ముగిసిన ఢిల్లీ పర్యటన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయాధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం భేటీ అయ్యారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ పర్యటన చేపట్టిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ గురువారం పర్యటన ముగించుకుని విజయవాడకు తిరిగి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విమానాశ్రయానికి బయల్దేరి వెళ్తూ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ సమావేశం కోసం సోమవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్న నేతలిద్దరూ మూడు రోజులుగా బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించారు. బుధవారం కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి వి.మురళీధరన్‌ను, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన నేతలు గురువారం బీజేపీ అధ్యక్షుడితో సమావేశమయ్యారు.

ఈ భేటీలో ఏం చర్చించారన్న విషయాలపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ గురించి, ఆ క్రమంలో 2014 తరహా కూటమి గురించి చర్చించినట్టు తెలిసింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే జగన్మోహన్ రెడ్డిని నిలువరించగలమని, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా ఈ పొత్తు అనివార్యమని అధిష్టానం పెద్దలకు పదే పదే చెప్పినట్టు సమాచారం.

మరోవైపు బీజేపీ అధిష్టానం తెలుగుదేశం పార్టీతో పొత్తుపై వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. పార్టీలోని కొందరు నేతలిచ్చిన సమాచారం ప్రకారం తెలుగుదేశం, వైఎస్సార్సీపీ పార్టీలతో సమదూరం పాటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే బీజేపీ సొంతంగా ఎదగాలంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు అడ్డుగా మారుతోందని, ఈసారికి జనసేనతో మాత్రమే కలిసి సాగాలని.. ఒకవేళ జనసేన తమను వదులుకుని తెలుగుదేశంతో వెళ్లిపోయినా సరే, ఒంటరిగానే పోటీ చేయాలన్న భావనలో ఉన్నారని సమాచారం. 

Advertisement

తాజా వార్తలు

Advertisement