జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి వివాదంపై మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ టోలిచౌకిలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారాహి వాహనానికి TS13EX 8384 నెంబర్ కేటాయించినట్లు తెలిపారు. ఇక.. వారాహి వాహనానికి రవాణాశాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని వెల్లడించారు. వారం రోజుల క్రితమే వాహనం రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుందని తెలిపారు. దీని బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని పేర్కొన్నారు.
అలాగే వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ గా నిర్ధారించామని, ఈ మేరకు వాహనం ఆర్ సీ మీద వివరాలు ముద్రించినట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. వాస్తవానికి వాహనాల రంగులకు కోడ్స్ ఉంటాయి. అని భారత ఆర్మీ సంస్థ ఉపయోగించే కలర్ కోడ్ అంటే ఆర్మీ కలర్: 7B8165 కాగా.. ఇప్పుడు జనసేన అధినేత ఎన్నికల వాహనం వారాహి కలర్ కోడ్ :445c44 అని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో వారాహి వాహనం రంగుపై ఎటువంటి అభ్యంతరం లేదని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. జనసేన వాహనం రంగు ‘ఆలివ్ గ్రీన్’ కాదని, ‘ఎమరాల్డ్ గ్రీన్’ అని స్పష్టత ఇచ్చారు. ఇది నిబంధనలకు లోబడే ఉందని తెలిపారు.