న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందని, ఎవరైనా అడ్డం వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పవన్ కళ్యాణ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఆయన భద్రత విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని వై-కేటగిరి భద్రత కల్పించాలని కోరారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పాలన గురించి అమిత్ షా, జేపీ నడ్డాలు స్పష్టమైన సంకేతాలిచ్చారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఏపీలో ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుందని దుయ్యబట్టారు. లిక్కర్ కింగ్‌లు స్టిక్కర్ కింగ్‌లుగా మారారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి విషయంలోనూ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వాటి గురించి బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా సాఫ్ట్‌వేర్ మాదిరిగా సున్నితంగా విమర్శిస్తే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం హార్డ్‌వేర్ మాదిరిగా పదునైన విమర్శలు చేశారని వ్యాఖ్యానించారు.
అమిత్ షా మాట్లాడిన తీరుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని అన్నారు. జగన్ ఆలోచన విధ్వంస రచని అని, సొంత చిన్నాన్నను చంపించారని తీవ్ర ఆరోపణలు చేశారు. వివేక హత్య కేసును అంతులేని కథగా మార్చారని, జులై 3న సుప్రీంకోర్టులో జరగనున్న కేసు విచారణతో అంతులేని కథ అంతం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇంకా ఎంత మంది పేరులో ‘వైఎస్’ కల్గినవారు బయటికొస్తారన్నది తేలుతుందని అన్నారు. అలాగే వివేక హత్య కేసు దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు పెంచుతుందని అన్నారు. జగన్ ఒక నిత్య అసంతృప్తవాది అని విమర్శించారు. విశాఖపట్నం ఎంపీ కిడ్నాప్ వ్యవహారం అంతా ఒక నాటకమని అన్నారు.