పంద్రాగస్టు సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిఒక్కరికి పేరుపేరునా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ భావితరాల వారి భవిష్యత్ కోసం కృషి చేస్తుందని పవన్ స్పష్టం చేశారు. ఆనాడు ఎందరో మహనీయులు వారి సర్వస్వం అర్పించి మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెడితే. ఇప్పుడు ఉన్న ఈతరం నాయకులు మాత్రం తమ ఆస్తులను పెంచుకుని ప్రజల ఆస్తులను మాత్రం కొల్లగొట్టేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆ నాయకులకు, ఈ నాయకులకు తేడా ఇదేనన్నారు.
ఈరోజు ఏ పార్టీకి లేనంత అభిమానులు జనసేనకు అభిమానులు ఉన్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రతి ఊరిలోనూ జనసేన జెండా రెపరెపలాడుతుందంటే కారణం దానికి ప్రేరణ స్వాతంత్ర్య సమరయోధులేనని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు పలువురు నాయకులు ముఖ్యమంత్రి పేరో, వాళ్ల కుటుంబసభ్యుల పేర్లో పెట్టుకుంటున్నారని.. కానీ వాళ్లు దేశం కోసం పనిచేసిన వాళ్లు కాదని.. ప్రజల డబ్బును ట్యాక్స్ రూపంలో కట్టించుకుని పథకాలకు వారి పేర్లు పెట్టుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఏ నాయకుడికి కూడా ఒక్కసారైనా పథకానికి పొట్టిశ్రీరాములు గారి పేరు, ప్రకాశం పంతులు గారి పెట్టాలని ఆలోచన రాదా? అంటూ నిలదీశారు. ప్రస్తుత నాయకులకు స్వాతంత్ర్య సమరయోధుల మీద గౌరవం ఉంటే పథకాలకు వారి పేర్లు పెట్టాలని హితవు పలికారు. జనసేన రేపు భవిష్యత్‌లో అధికారంలోకి వస్తే పథకాలకు జాతీయనాయకుల పేర్లే పెడుతుందని, అందులోనూ రాష్ట్ర స్థాయిలో ఉన్న జాతీయ నేతల పేర్లే పెడతామని పవన్ స్పష్టం చేశారు.
ఈ వార్త కూడా చదవండి: ఏపీలో ఈనెల 21 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు