మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతుండగా ఈ ఎన్నికలలో ఓటు వేసేందుకు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఓటు వేసేందుకు వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇంత హడావిడి అవసరం లేదు. ఈ ఎన్నికలలో ఎవరికి ఓటు వేస్తానో చెప్పలేను. సినీ ఇండస్ట్రీ చీలడమనే ప్రశ్నే లేదు. వ్యక్తిగత దూషణలు అనవసరం. ఈ స్థాయిలో ఎన్నికలు జరగడం ఎప్పుడు చూడలేదు. సినిమా చేసే వాళ్లు ఆదర్శంగా ఉండాలి. తిప్పికొడితే 900 ఓట్లు ఉన్నాయి. మోహన్ బాబు, చిరంజీవి మంచి స్నేహితులే’ అని పవన్ అన్నారు.
జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటింగ్ జరుగుతుండగా.. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏడు బ్యాలెట్ పేపర్స్‌లో 26 మంది సభ్యులను ఒక్కో ఓటర్ ఎన్నుకోనున్నారు.