Sunday, November 17, 2024

ఏపీ డ్రైవర్లను వద్దనడం కరెక్ట్ కాదు.. ఉప ముఖ్యమంత్రి పవన్

హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ఒక్కటేనన్న భావన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల దాదాపు 2 వేల కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయని, తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల సోదరులు తమ భృతి విషయంలో సానుకూలంగా స్పందించి సహకరించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవ‌ర్లను అడ్డుకుంటున్నారని, దీంతో అక్కడ బతకలేకపోతున్నామని వందలాది క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యను చెప్పేందుకు మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ పదవీకాలం ముగిసిందని, హైదరాబాద్ వదిలి వెళ్లాలని అధికారులు, క్యాబ్ డ్రైవర్లు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వారి ఫిర్యాదును విన్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయి. మళ్లీ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఇక్కడ కూడా తగిన అవకాశాలు పెరుగుతాయి. ఉమ్మడి రాజధాని గడవుకాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదు. 2 వేల కుటుంబాల వేదన దీనిలో దాగుంది. మానవత థృక్పధంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటాం. అక్కడి క్యాబ్ డ్రైవర్ కార్మికులు సైతం ఆంధ్రప్రదేశ్ కు చెందిన తోటి డ్రైవర్లకు తగు విధంగా స్పందించాలి. ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాలు తగు విధంగా సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉంది.’’ అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement