Monday, November 25, 2024

వైసీపీ ముక్త్ ఆంధ్రప్రదేశ్ కోసమే పని చేస్తా.. ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వైసీపీ ముక్త్ ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన సోమవారం కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మురళీధరన్‌తో సమావేశమై పలు అంశాలను చర్చించిన పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం మళ్లీ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ సంఘటన్ నేత శివ్‌ప్రకాశ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీతో తలెత్తుతున్న అంతర్గత సమస్యలను పవన్ కళ్యాణ్ వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఎందుకు మద్దతివ్వలేదని జాతీయ నాయకత్వం ప్రశ్నించినట్టుగా సమాచారం. అయితే తాము బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తే ఓట్లు చీలిపోయి వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలుండడం వల్ల తాము మద్దతివ్వలేకపోయామని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏ అంశాల మీదా జనసేన తమతో కలిసి నడవట్లేదని రాష్ట్ర బీజేపీ నాయకులు జాతీయ నాయకత్వం దృష్టికి తరచుగా తీసుకొస్తుండగా, నేటి సమావేశంలో ఆ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

హోంమత్రి అమిత్ షా కర్ణాటక ఎన్నికల హడావుడిలో ఉండడంతో రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. దాదాపు ముప్పావు గంటసేపు వారిద్దరి మధ్య చర్చలు నడిచాయి. సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ పాలన నుంచి విముక్తి కల్పించటమే జనసేన అజెండా అని, బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అదే కోరుకుంటోందని తెలిపారు. ఈ అంశం మీదే సమావేశంలో లోతుగా చర్చించామని చెప్పారు. రెండు రోజులుగా జరిగిన చర్చల బలమైన సత్ఫలితాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నదే తమ అభిమతమని వెల్లడించారు. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తామన్నారు. ముందుగా తమను తాము బలోపేతం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.  

రాష్ట్రంలో జరుగుతున్న గొడవలు, వైసీపీ అరాచకాలపై సమగ్రంగా చర్చలు జరిపామని వెల్లడించారు. చట్టబద్దమైన విధానాలు రాష్ట్రంలో అమలు కావడంలేదని ఆరోపించారు. ఇతర పార్టీలతో పొత్తుల అంశం ప్రతిపాదనలు, చర్చ ప్రస్తుతం జరగలేదని, రానున్న రోజుల్లో సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలపై సమాలోచనలు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, ఎలా వెళ్లాలన్న దానిపై అన్ని కోణాల్లో ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. అధికారం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. అటు బీజేపీ, ఇటు జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement