న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఓటుబ్యాంకు లేదని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. శుక్రవాడం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జరిగిన భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వివరిస్తూ.. పవన్ కళ్యాణ్‌కు 2-3 శాతానికి మించి ఓటు బ్యాంకు లేదని, ఎందుకు ఆయన వెంట పడుతున్నారని తాను అమిత్ షాను ప్రశ్నించినట్టు చెప్పుకొచ్చారు. అందుకాయన బదులిస్తూ తాము పవన్ వెంటపడడం లేదని, ఆయనే తమ వెంటపడుతున్నారని అమిత్ షా బదులిచ్చారని కేఏ పాల్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఓటుబ్యాంకు లేదని, తెలంగాణలో 7-8 శాతం వరకు ఉంటే, ఏపీలో అరశాతం మాత్రమే ఉందని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము దేశవ్యాప్తంగా 178 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్యంలోని 8 రాష్ట్రాల్లో 25, దక్షిణాది రాష్ట్రాల్లో 150, పాండిచ్చేరి, గోవాలో కలిపి మొత్తం 178 సీట్లలో గెలుపొందుతామని అన్నారు. దేశంలో బీజేపీకి తామే ప్రతిపక్షంగా ఉంటామని కూడా వ్యాఖ్యానించారు.
అప్పుల కుప్పగా తెలుగు రాష్ట్రాలు, శ్రీలంక బాటలో భారతదేశం
దేశంలోని పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. గాంధీ-నెహ్రూ కుటుంబ పాలనలో దేశం నాశనమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రాల్లో భూస్థాపితం అయిపోయిందని, గాంధీ కుటుంబాన్ని తప్ప ఇంకో కుటుంబాన్ని వాళ్లు నమ్మరని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మోదీ సర్కారు వచ్చిన తర్వాత దేశ రుణాలు రెట్టింపయ్యాయని ఆరోపించారు. మోదీ రాకముందు వరకు రూ. 50 లక్షల కోట్లు అప్పు ఉండగా, ఆయనొచ్చిన తర్వాత మరో రూ. 50 లక్షల కోట్లు అప్పులు చేశారని కేఏ పాల్ ఆరోపించారు. దేశం మరో శ్రీలంక, నైజిరీయా, వెనిజ్యులాలా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సను కూడా తాను హెచ్చరించానని, కుటుంబ పాలన వద్దని చెప్పినా వినలేదని, చివరకు ఫలితం అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. శ్రీలంక తరహాలోనే తెలంగాణలోనూ కేసీఆర్ కుటుంబం నుంచి ఐదుగురు పాలిస్తున్నారని సూత్రీకరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల కుప్పగా మారాయని, ఏపీ అప్పు రూ. 8 లక్షల కోట్లుగా ఉండగా, తెలంగాణ అప్పు రూ. 4.5 లక్షల కోట్ల వరకు ఉందని అన్నారు. కుటుంబ పార్టీలు దేశాన్ని, రాష్ట్రాలను దోచుకుంటున్నాయని మండిపడ్డారు.
నన్నే కలవాలనుకున్నారు.. అందుకే వెళ్లాను
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీ గురించి వివరణ ఇస్తూ.. తాను కలవాలనుకోలేదని, అమిత్ షాయే ఆహ్వానిస్తే వెళ్లి కలిశానని చెప్పుకొచ్చారు. అంతకుముందు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా తనను కలిసి 3 గంటల పాటు అనేకాంశాలపై చర్చించారని, తాను ఢిల్లీ వచ్చిన విషయం రూపాలా ద్వారా తెలుసుకున్న అమిత్ షా తనను కలవాలనుకుంటున్నట్టు చెప్పారని అన్నారు. అమిత్ షాను కలిసిన సందర్భంగా తనపై జరిగిన దాడిని బహిరంగంగా ఖండించాలని చెప్పానన్నారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా కేసీఆర్, చంద్రబాబు నాయుడు దోచుకున్న లక్షల కోట్ల రూపాయల సొమ్ముపై విచారణ జరపాలని కూడా అమిత్ షాను కోరినట్టు కేఏ పాల్ చెప్పారు. దేశంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకొచ్చేలా ఒక సదస్సు నిర్వహిద్దామని, దానికి అనేక మంది ఇన్వెస్టర్లను, దేశాధినేతలను తీసుకొచ్చే ఏర్పాటు తాను చేస్తానని అమిత్ షా కు సూచించినట్టు కేఏ పాల్ అన్నారు. ఒకట్రెండు వారాల్లో ప్రధాని మోదీతో కలిసి చర్చిద్దామన్నారని వెల్లడించారు.
నా FCRA లైసెన్సు గురించి అమిత్ షాతో చర్చించలేదు
దేశంలో అనేక స్వచ్ఛంద సంస్థల FCRA లైసెన్సులు రద్దు చేసినప్పుడు తాను తీవ్రంగా వ్యతిరేకించినట్టు కేఏ పాల్ గుర్తుచేశారు. ఢిల్లీ హైకోర్టులో న్యాయపోరాటం చేసి 16వేల ఎన్జీవోల లైసెన్సుల పునరుద్ధరణకు సహాయం చేశానన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి 178 ఎన్జీవోల లైసెన్సులు పునరుద్ధరించగలిగానని, తద్వారా అనేక ఎన్జీవోలకు రూ. 55 వేల కోట్ల మేర నిధులు వచ్చాయని అన్నారు. అయితే తన ఎన్జీవో లైసెన్సు గురించి అమిత్ షాతో చర్చించలేదని తెలిపారు. ఇకపోతే జెడ్ ప్లస్ భద్రత కోసం లేఖ ఇచ్చినట్టు కేఏ పాల్ తెలిపారు. తనకు దేవుడు, ప్రజలే భద్రత అంటూ వ్యాఖ్యానించిన ఆయన, చట్టప్రకారం కేంద్రం సెక్యూరిటీ ఇస్తే తీసుకుంటానని చెప్పారు.