పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ఏపీలో ఈ సినిమా విషయంలో వివాదం నెలకొంది. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో వివాదం నెలకొంది. గతంలో పెద్ద సినిమాలకు అదనపు షోలకు అనుమతులు ఇస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవోలు ఇచ్చేవి. ఇప్పటికే 9, 10 తేదీల్లో ప్రీమియర్ షోలు, బెన్‌ఫిట్ షోలు, రెగ్యులర్ షోలకు ధరలు పెంచి టికెట్స్ అమ్మేశామని, ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించామని థియేటర్ యజమానులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సడెన్‌గా ఏపీ రెవిన్యూ అధికారులు బెనిఫిట్ షోలకు అనుమతి లేదని, టికెట్ ధర పెంచి అమ్మితే థియేటర్ సీజ్ చేస్తామని కూడా థియేటర్ యజమానులకు హెచ్చరిక చేసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన మెగాభిమానులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందంటూ అభిమానులు మండిపడుతున్నారు.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆందోళనకు దిగారు. వకీల్ సాబ్ సినిమాకి బెనిఫిట్ షో టిక్కెట్లు కొన్న అభిమానులు.. థియేటర్లో బెనిఫిట్ షో వేయక పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెనిఫిట్ షో వేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఇంటి వద్దకు వెళ్లి అభిమానుల నిరసన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.