న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆగస్టు 15లోగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పొందుపర్చిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద 3 గంటల పాటు మౌనదీక్ష తలపెట్టిన కేఏ పాల్, అక్కడికి చేరుకున్న కాసేపటికే వర్షం తీవ్రరూపం సంతరించుకుంది. దీక్ష అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ప్రధాని మోదీ విభజన హామీలు అమలుచేయడం లేదని ఆరోపించారు.
అందుకు నిరసనగానే తాను జీవితంలో మొదటిసారిగా మౌనదీక్ష చేశానని చెప్పారు. తనతోపాటు 2.10 కోట్ల మంది ప్రజలు ఉపవాసం ఉండి తన దీక్షకు సంఘీభావం తెలిపారని ప్రకటించారు. విభజన హామీల అమలు కోసం బుధవారం జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపడతానని వెల్లడించారు. తెలుగువాడి సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావని, తాను చేపట్టే ధర్నాకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. తాను అధికారంలోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తానని కేఏ పాల్ పునరుద్ఘాటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.