ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కమ్యునిస్టు నాయకుడు పాటూరు రామయ్య జీవిత చరమాంకంలో ఇబ్బందులు పడుతుండడం అందరినీ కలచివేస్తోంది. కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం అంటే ప్రస్తుత పామర్రు నుంచి గతంలో ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1989, 1994, 2004లో శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన.. వేలాది మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇప్పించడంలోను, వారి సమస్యలు పరిష్కరించడంలోను ఎనలేని కృషి చేశారు. మరెందరో బడుగులకు మిగులు భూములు ఇప్పించిన ఘనత కూడా ఈ సీపీఎం నేతదే.
ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవలే సంక్రాంతి సందర్బంగా ఆయన చల్లపల్లి సమీపంలోని చింతలమడ వెళ్లారు. పాటూరు రామయ్య రాక విషయం తెలిసిన పలువురు నేతలు ఆయన్ను కలుసుకుని ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. 80 ఏళ్ల వయసులో సొంత ఆస్తులు లేక ఉండడానికి ఇల్లు లేక ఆయన ఇబ్బంది పడుతున్నట్టు తెలిసి ఆవేదనకు గురయ్యారు. ఇన్నాళ్లూ ఆయన పెంచుకున్న కూతురు వద్దే ఉంటున్నా.. శేష జీవితాన్ని కృష్ణా జిల్లాలోని చల్లపల్లి లేదా మచిలీపట్నంలో గడపాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం తనకు ఇంటి స్థలం మంజూరు చేస్తే అక్కడే చిన్న గుడిసె వేసుకుని ఉంటానంటున్నారు.
ఈ వార్త కూడా చదవండి: టీటీడీలో వారసత్వ అర్చక విధానం.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం