Friday, November 22, 2024

Delhi | సుప్రీంకోర్టులో పట్టిసీమ, పురషోత్తపట్నం పర్యావరణ ఉల్లంఘనల కేసు.. తదుపరి విచారణ అక్టోబర్‌కు వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టుతో పాటు పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల్లో జరిగిన పర్యావరణ ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ. 4.39 కోట్ల పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. పర్యావరణ ఉల్లంఘనలపై ప్రముఖ సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు, దివంగత మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను అమలు చేయడం లేదని, పర్యావరణానికి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం లేదని పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్‌తో కూడిన ధర్మాసనం పెనాల్టీ చెల్లించడమంటే ప్రభుత్వం తనకు ఎవరికో మేలు చేయడం లాంటిది కాదని, కోర్టు ఆదేశాలను అమలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిహారం సొమ్మను డిపాజిట్ చేసినట్టు మంగళవారం నాటి విచారణలో వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు బాధితులు, నిర్వాసితుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ పరిహారం సొమ్మును నిర్వాసితులకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు నిరాకరించిన ధర్మాసనం పరిహారం సొమ్మును పర్యావరణ పరిరక్షణ కోసం మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. నిర్వాసితులకు పరిహారం అందజేసే అంశం భూసేకరణ చట్టం పరిధిలో ఉంటుందని, ఆ ప్రకారమే వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో తేల్చుతామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణ ఈ ఏడాది అక్టోబర్‌కు వాయిదా వేసింది.

- Advertisement -

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. పోలవరం, పట్టిసీమ , పురుషోత్తపట్నం ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ పెంటపాటి పుల్లారావు, వట్టి వసంత్ కుమార్ తదితరులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. ఎన్జీటీ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి పరిహారంపై నివేదిక కోరింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసిన నిపుణుల కమిటీ రూ. 24 కోట్ల పరిహారం చెల్లించాల్సిందిగా సూచించింది. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వ్యయం ఆధారంగా పెనాల్టీ మొత్తాన్ని రూ. 242 కోట్లకు సవరించి, ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ ఆదేశాలపై ‘స్టే’ ఇస్తూనే, నిపుణుల కమిటీ నిర్ణయించిన విధంగా నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు పురుషోత్తపట్నం ప్రాజెక్టు కోసం భూములు సేకరించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆరేళ్లుగా నష్టపరిహారం చెల్లించడం లేదని న్యాయవాది శ్రావణ్ కుమార్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement