Saturday, November 23, 2024

10 నుంచి తిరుమలలో పతంజలి యోగా దర్శనం..

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల నాదనీరాజన వేదిక పై ఈనెల 10 వ తేది నుంచి పతంజలి దర్శన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ధర్మగిరివేద విజ్ఞానపీఠం, కేంద్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం పండితులతో అదనపు ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా టిటిడి నిర్వహించిన సుందరకాండ, సకల కార్యసిద్ది శ్రీమద్రామాయణ పారాయణం, యుద్దకాండ, బాలకాండ, విరాటపర్వం, గీతాపారాయణ కార్యక్రమాలకు ప్రపంచ వ్యాప్తంగా భక్తుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. ఈనెల 9 వ తేదికీ విష్ణు సహస్రనామ పారాయణం పూర్తవుతుందని దాని స్థానంలో కుప్పా విశ్వనాథశర్మ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు యోగా దర్శన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనితో బాటు భగవ ద్గీత శ్లోక పారాయణం నిర్వహిస్తారని చెప్పారు. అదేవిధంగా గరుడ పురాణం, సభాపర్వం, అరణ్యపర్వం వంటి ఇతర పారాయణ కార్యక్రమాలు ఒకటి పూర్తయిన తరువాత ఒకటి ప్రారంభమవుతాయని వివరించారు.

కాగా అంతకు ముందు ప్రతినెలా నిర్వహించ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల పై ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
16 న చెన్నైలో శ్రీనివాస కళ్యాణం టిటిడి ఆధ్వర్యంలో ఈనెల 16 న చెన్నైలోని ఐలాండ్‌గ్రౌండ్‌లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు అదనపు ఈవో తెలిపారు. శ్రీనివాస కళ్యాణానికి ఆయా విభాగాలు చేయవలసిన ఏర్పాట్ల పై అధికారులతో ఆయన సమీక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్‌ఈ-2 జగదీశ్వర్‌రెడ్డి, ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు, ఎస్విబిసి సిఇవో సురేష్‌కుమార్‌, జియం శేషారెడ్డి, ఇతర విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement