Tuesday, November 19, 2024

పటాన్‌చెరుకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి.. త్వరలోనే శంకుస్థాప‌న చేయ‌నున్న కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: త్వరలోనే పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం రూ.185కోట్లు మంజూరు చేసిందన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ వచ్చి ఆసుపత్రిని ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ జమానాలో… టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారాయన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణం లో పర్యటించి బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. పటాన్‌ చెరువు నియోజకవర్గంలో 10 బస్తీ దవాఖానాలను మంజూరు చేశామన్నారు. బీరంగూడ, లింగయ్య కాలనీ, బంధం కొమ్ములో బస్తీ దవాఖానాలను మంగళవారం ప్రారంభించారు. బస్తీ దవాఖానాలు పేదల సుస్తీని పోగొట్టి దోస్తీ దవాఖానాలుగా మారాయని, పైసా ఖర్చు లేకుండా వైద్యం, పరీక్షలు, మందులను పేద రోగులకు అందిస్తున్నాయని చెప్పారు. అందుకే ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారని చెప్పారు. బస్తీల్లో పేదల సుస్తీని పొగొట్టేందుకు దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డిలో బస్తీ దవాఖానాల ద్వారా మంచి వైద్యం అందుతోందన్నారు. సాధారణ ప్రసవాలకు ఎక్కువ డబ్బును ప్రయివేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి సాధరణ ప్రసవం చేయించుకుంటే తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని చెప్పారు.

అమీన్‌పూర్‌లో 25కోట్లతో పనులు చేపడతామని చెప్పారు.
దసరా పండగ నాటికి కొత్త ఆసరా పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌ కార్డులు దసరా నాటికి అందిస్తామన్నారు. ఇంటి జాగా ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికసాయాన్ని అందిస్తామన్నారు. అమీన్‌పూర్‌ కాంగ్రెస్‌ పాలనలో ఎలా ఉండేది…? ఇప్పుడు ఎలా ఉందో..? ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. అమీన్‌పూర్‌ దశ, దిశను మార్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ ప్రాంతానికి రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీని మంజూరు చేశారని గుర్తు చేశారు. మెడికల్‌ కాలేజీ పనులు వేగంగా నడుస్తున్నాయని, త్వరలోనే సీఎం కేసీఆర్‌ వచ్చి కాలేజీని ప్రారంభిస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో 650 పడకలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. పేదలకు నాణ్‌యమైన వైద్యం అందించేందుకు 100మంది డాక్టర్లను నియమించనున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement