Friday, October 4, 2024

TG: స్థానిక పోరుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి… పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

త్వరలోనే స్థానిక ఎన్నికలు…..
90శాతం సీట్లు సాధించాలి….
పార్టీకి కార్యకర్తలే బలం….
భవిష్యత్తులో దేశ ప్రధాని రాహుల్ గాంధీ……
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

బిక్కనూర్, అక్టోబర్ 4 (ప్రభ న్యూస్) : త్వరలో జరగనున్న స్థానిక పోరుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఆయన సొంత జిల్లా అయిన నిజామాబాద్ కు వెళుతుండగా బిక్కనూరు మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున టోల్ ప్లాజావద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. 90శాతం సీట్లు సాధించే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు పోవాలని సూచించారు. పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందే విధంగా ప్రచారం చేయాలని చెప్పారు.

పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. పార్టీ శ్రేణులు సిద్ధమై విజయం దిశగా ముందడుగు వేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వ‌లేక ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. వారి ఆరోపణలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు. రుణమాఫీ విషయంలో కొన్ని సాంకేతిక లోపాలు ఏర్పడినట్లు చెప్పారు. రెండు లక్షల లోపు ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని చెప్పారు.

అనంతరం బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు. వాటిని ఓరువలేక ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ…. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందన్నారు. రుణమాఫీ విషయంలో ఏ ఒక రైతుకు అన్యాయం జరగదని చెప్పారు. రెండు లక్షల లోపు ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. రెండు లక్షల పైన ఉన్న రైతుల విషయంలో త్వరలోనే తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అప్పటివరకు ఇలాంటి రుణాలు చెల్లించవద్దని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ… గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకొని లక్షల కోట్లు సొమ్ము చేసుకున్నారని చెప్పారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గానికి కాలేశ్వరం ద్వారా సాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం వారిని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ యూసుఫ్ పల్లి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఇలియాస్, ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, జిల్లా ఎన్నారై సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, సుదర్శన్ వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement