Wednesday, November 20, 2024

వీసాతో భాగస్వామ్యం.. క్రెడిట్‌ కార్డు బిజినెస్‌లోకి అదానీ

అమెరికాకు చెందిన డిజిటల్‌ పేమెంట్‌ సంస్థ వీసా గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌తో కో-బ్రాండెడ్‌ కార్టు తీసుకు వచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ కో-బ్రాండెడ్‌ కార్డుతో 40 కోట్ల మంది ప్రయాణీకులను ఆకర్షించాలని నిర్ణయించారు. ఈ కార్డు ద్వారా రిటైల్‌, ఎయిర్‌ పోర్ట్‌, ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సర్వీసెస్‌ వంటివి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు అదానీ ఎయిర్‌ పోర్టుల ద్వారా ప్రయాణిస్తున్న వారిని ఆకర్షించడంతో పాటు, వారికి ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సర్వీస్‌లను అందించనున్నట్లు వీసా సీఈఓ ర్యాన్‌ మెక్‌నెర్నీ తెలిపారు.


అదానీ గ్రూప్‌ దేశంలో ప్రస్తుతం ఏడు ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది. ముంబై, అహ్మదాబాద్‌ వంటి అతి ముఖ్యమైన ఎయిర్‌పోర్టులు ఇందులోఉన్నాయి. వీటితో పాటు నవీ ముంబై గ్రీన్‌ ఫిల్ట్‌ ఎయిర్‌పోర్టును కూడా అదానీ గ్రూప్‌ అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అదానీ ఎయిర్‌పోర్టుల్లో 92 శాతం దేశీయ ప్రయాణికులు, 133 శాతం అంతర్జాతీయ ట్రావెలర్స్‌ పెరిగారు. ప్రభుత్వం ప్రైవేటీకరించనున్న అన్ని ఎయిర్‌పోర్టులకు బిడ్దింగ్‌ వేస్తామని గతంలోనే అదానీ గ్రూప్‌ ప్రకటించింది.

- Advertisement -

నవీ ముంబై ఎయిర్‌పోర్టును 2,866 ఎకరాల్లో అభివృద్ధి చెస్తున్నారు. ఇక్కడి నుంచి 2036 నాటికి 90 మిలియన్ల ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తారని అంచనా. వీసా 200 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీసాతో కలిసి అదానీ గ్రూప్‌ తీసుకురానున్న కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుతో సాధారణ కార్యకలాపాలతో పాటు, ఆయా సంస్థలు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలు, సేవలను ఉపయోగించుకోవచ్చు.

అదానీ గ్రూప్‌ ఇప్పటికే ట్రైన్‌మ్యాన్‌, క్లియర్‌ట్రిప్‌ సంస్థల్లో వాటాలను కొనుగోలు చేసింది. అదానీ వన్‌ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను యాప్‌ను కూడా నిర్వహిస్తోంది. ఇందులో విమాన టికెట్లను, రైలు టికెట్లను, హోటల్‌ బుకింగ్స్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐసీఐసీఐ-మేక్‌ మైట్రిప్‌ కో-బ్రాండెడ్‌ కార్డుతో పాటు, ఎస్‌బీఐ-యాత్ర, యాక్సిస్‌ బ్యాంక్‌- విస్తారా వంటి ట్రావెల్‌ ఆధారిత కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు అందుబాటులోఉన్నాయి. ఈ ఒప్పందంతో అదానీ గ్రూప్‌ కూడా ఈ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది

Advertisement

తాజా వార్తలు

Advertisement