హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే నాటి ‘దేశ విభజన ఘోరాలు’ ప్రదర్శన కార్యక్రమాన్ని 70 రైల్వే స్టేషన్లలో నిర్వహించింది. దేశ విభజన జరిగిన రోజును పురస్కరించుకొని ఎస్సీఆర్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్లలో ప్రత్యేక ఫోటో ప్రదర్శనను ఆదివారం ఏర్పాటు చేశారు. ఆగస్టు 14న దేశవ్యాప్తంగా దేశ విభజన ఘోరాల స్మరణదినం పాటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
దేశ విభజన తరువాత తరలి వెళ్లే క్రమంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న 700 స్టేషన్లలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తద్వారా దేశ విభజన సమయంలో మన పూర్వీకులు అనుభవించిన కష్టాలను, వేదన, దు:ఖాన్ని తెలియజేయడం రైల్వే బోర్డు ముఖ్య ఉద్దేశమని ఒక ప్రకటనలో తెలిపారు.