Saturday, November 23, 2024

త్వరలో ప్రజా సంగ్రామ యాత్ర పార్ట్ 2.. డిప్రెషన్‌లో కేసీఆర్-వెంటిలేటర్‌పై కాంగ్రెస్ : బీజేపీ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిప్రెషన్‌లో, కాంగ్రెస్ వెంటిలేటర్‌పై ఉన్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంతో కలిసి న్యూఢిల్లీలోని తరుణ్ చుగ్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం ముగ్గురూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ… త్వరలో ప్రజా సంగ్రామ యాత్ర పార్ట్ 2 మొదలవుతుందని వెల్లడించారు. ప్రజా గోస – బీజేపీ భరోసా పేరుతో సభలు, సమావేశాలు జరుపుతామని, ఇందులో భాగంగా 10 పాత జిల్లాల్లో భారీ సభలు పెడతామని వివరించారు. మార్చి 31 వరకు రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని, హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతారని చెప్పుకొచ్చారు.

మిగతా సభలకు జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రిపై, బీజేపీపై నమ్మకం ఉందని, ప్రధాని నేతృత్వంలో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో అవినీతి గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ, పంజాబ్ వరకు వచ్చిందని విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రజల సమస్యలపై కాకుండా రాజకీయ వేదికగా మార్చుకుని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని  విమర్శించేందుకు పెట్టుకున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. అధికారం చేజారుతోందని కేసీఆర్‌కు అర్థమైందని, అందుకే ఆయనలో గాభరా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కనే కలలు కాంగ్రెస్‌కూ వస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి పూర్తి మెజారిటీతో అధికారం కట్టబెడతారని, 119 సీట్లలో గెలవడం కోసం తాము పోరాడతామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ… తాము అధికారంలోకి రాలేమని కాంగ్రెస్ నేతలే అంటున్నారని, అందుకే వాళ్లు కలిసి పోటీ చేయాలని ఆరాటపడుతున్నారన్నారు. ఎన్నికల తర్వాత కలవాలనుకుంటే అది జనాన్ని మోసం చేయడమేనని, కాంగ్రెస్‌కి ఓటేస్తే వాళ్లు మళ్లీ కలిసేది భారాసలోనేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ చేసే యాత్రలతో ఉపయోగం లేదన్న బండి సంజయ్, బీజేపీకి ఓటేసి పూర్తి మెజారిటీ ఇవ్వాలని జనం డిసైడయ్యారని తెలిపారు. ఎన్నికల వరకు కొట్లాడినట్టు నటించి, కాంగ్రెస్- కమ్యూనిస్ట్ పార్టీలు భారత రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. కేసీఆర్‌ డిప్రెషన్‌లో ఉన్నారని, ఈటెల ఇంకా తన మనిషి అనుకుని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. భారత రాష్ట్ర సమితి అంటే దండుపాళ్యం బ్యాచ్ అంటూ బండి సంజయ్ భాష్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement