– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
లిక్కర్ మాఫియా డాన్ని కనిపెట్టేందుకు బిహార్ పోలీసులు యత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో గయా పోలీసులు మాఫియా డాన్‌కు చెందిన చిలుకను అతని ఆచూకీ గురించి ప్రశ్నిస్తారు. అతని గురించే ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని ఎదురుచూశారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మొన్న రాత్రి గురువా పోలీస్ స్టేషన్ బృందం.. సబ్-ఇన్‌స్పెక్టర్ కన్హయ్య కుమార్ నేతృత్వంలో లిక్కర్ డాన్ అమృత్ మల్లాను అరెస్టు చేయడానికి గ్రామంలోకి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. అయితే అతను అప్పటికే తన ఇంటి నుండి తప్పించుకుని పారిపోయాడు. పోలీసు బృందం అతని ఇంటికి చేరుకోగా.. వారికి ఒక చిలుక మాత్రమే కనిపించింది. మల్లా గురించి కొంత సమాచారం కావాలని కన్హయ్య కుమార్ ఆ చిలుకను ప్రశ్నిస్తాడు. అతని గురించి హిందీ, మగాహిలో అడగడంతో అది “కటోరే కటోరే కటోరే” (గిన్నె) అని మాత్రమే సమాధానం ఇచ్చింది.
“ఇ మిత్తు (చిలుక), తోహర్ మాలిక్ కహా గెలో, తోహర్ మాలిక్ చోర్ కే భాగ్ గెలో” అని అతను ఆ చిలుకని పదే పదే ప్రశ్నిస్తాడు. అది “కటోరే కటోరే కటోరే” అని అన్నిసార్లు సమాధానమిచ్చింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
కటోరాలో మద్యం తయారవుతుందని కన్హయ్య కుమార్ అడిగినప్పుడు, చిలుక మళ్లీ “కటోరే కటోరే కటోరే” అని సమాధానం ఇచ్చింది. ఈ వీడియో చూసిన ఒక నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు.. “చిలుక నుండి రహస్యాన్ని రాబట్టడంలో పోలీసులు విఫలమయ్యారు”. అని రాశాడు. మరొక నెటిజన్ అయితే.. “చిలుక తన గురువుకు విధేయంగా ఉంటుంది. తన రహస్య ప్రదేశాలను బహిర్గతం చేయదు”. అని రాసుకొచ్చాడు.