అదాని అంశంపై చర్చకు విపక్షాలు పట్టు
లోక్ సభ, రాజ్య సభలోనూ గందరగోళం
అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో మోత
ఇరు సభలు 27వ తేదికి వాయిదా
న్యూ ఢిల్లీ – పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే విపక్ష సభ్యుల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. అదానీ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడటంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను ఎల్లుండికి వాయిదా వేశారు. అటు లోక్ సభను కూడా అదానీ వ్యవహారం కుదిపేసింది. విపక్ష సభ్యుల నినాదాలతో హోరెత్తడంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశాల్ని ఈ నెల 27కు వాయిదా వేశారు.
అదానీ ఇష్యూపై రాజ్యసభలో దుమారం..
అదానీ వ్యవహారం రాజ్యసభను కుదిపేసింది. శీతాకాల సమావేశాల తొలిరోజే అదానీ అంశంపై చర్చ జరపాలని విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పట్టుబట్టారు. సమావేశాలను ప్రారంభించిన గంటలోనే ఎంపీల నినాదాలతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఏఐసీసీ ప్రెసిడెంట్, సీనియర్ రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో అదానీ ఇష్యూపై చర్చ మొదలుపెట్టాలని కోరారు. అందుకు రాజ్యసభ చైర్మన్ అంగీకరించకపోవడంతో సభలో సభ్యులు నినాదాలు చేశారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదాపడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు కొనసాగడంతో దీంతో సభను ఎల్లుండి కు వాయిదా వేశారు.
లోక్ సభలోనూ అదే తంతు..
అటు లోక్ సభలోనూ ఇదే అంశంపై రచ్చ రచ్చైంది. వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన అదానీ అంశంపై చర్చించాల్సిందేనంటూ లోక్ సభలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టారు. పదే పదే స్పీకర్ ముందు నినాదాలు చేయడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్ సభ సమావేశాల్ని ఎల్లుండికి వాయిదా వేశారు.
మళ్లీ ఎల్లుండే..
పార్లమెంట్ సమావేశాల్ని సజావుగా సాగేందుకు సహాకరించాలని ప్రధాని మోదీ ముందుగా చెప్పినప్పటికి విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడానికే పట్టుబట్టాయి. దీంతో ఉభయసభలు ప్రారంభమైన గంటలోపే వాయిదా పడ్డాయి.