Tuesday, November 26, 2024

పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి.. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కొత్త పార్లమెంటుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రజా సంఘంల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం భారత రాజ్యాంగ రక్షణ మహా ధర్నాను నిర్వహించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని కాంతం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన రిజర్వేషన్లను కల్పించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి చరిత్రలో నిలిచిపోయారని హర్షం వ్యక్తం చేశారు. బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ బీసీ గణన చేపట్టాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీల పట్ల వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన దళిత, గిరిజన, బీసీ సంఘాల నేతలు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement