Friday, November 22, 2024

విపక్షాల నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్.. నల్ల చొక్కాలతో ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అదానీ అంశం-రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారంపై విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లింది. కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బీఆర్‌ఎస్ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో పాటు ప్రతిపక్షాల ఎంపీలు నల్ల చొక్కాలు వేసుకుని వచ్చి మరీ నిరసన తెలిపారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే సభ్యులంతా ప్లకార్డులు చేత పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినదించారు. ఒక దశలో సభ్యులంతా స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి, ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దు అప్రజాస్వామికమని నినదించారు. దీంతో స్పీకర్ ఓంబిర్లా లోక్‌సభను సాయంత్రం 4 గంటలకు, రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్‌తో సహా విపక్ష సభ్యులంతా నిరసన వ్యక్తం చేస్తూ విజయ్ చౌక్ వద్దకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం అందరూ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షాల మాదిరిగానే ప్రజలంతా ఏకమై కేంద్రానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దేశ సంపదను ఒక వ్యక్తి అందిన కాడికి దోపిడీ చేశాడంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై జేపీసీ వేయాలని రెండు వారాలుగా తాము డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు పెంచుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న కేంద్రానికి ప్రజలే బుద్ధి చెపుతారని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో తమను మాట్లాడనివ్వకుండా ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని నామ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల బీజేపీ ప్రభుత్వానికి నిబద్ధత లేదని, ఉంటే దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలపై దాడులు చేయించదని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement