ఆరు నెలల ముందుగానే ఎలక్షన్స్
పార్లమెంట్‌ను రద్దు చేయనున్న ప్రధాని రిషి సునాక్
ఆకస్మికంగా ఎన్నికల తేదీ ప్రకటన
జులై నాలుగున పోలింగ్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేశారు. ఆయన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల తేదీని గురువారం ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు సునాక్ తెరదించారు. జులై 4న ఎలక్షన్ ఉంటుందని ప్రకటించారు. త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు తెలిపారు. లండన్‌లో జోరుగా వర్షం కురుస్తున్నవేళ.. తన అధికారిక నివాసమైన ’10 డౌనింగ్ స్ట్రీట్’ మెట్లపై నిలబడి తడుస్తూనే ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్నికల తేదీని ప్రకటించారు.
బ్రిటన్ భవిష్యత్ నిర్ణయిద్దాం..
బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని రిషి సునాక్ అన్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా తన హయాంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ కంటే విపక్ష లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తుండడం గమనార్హం.