Saturday, November 23, 2024

జేబీఎస్, ఎంజీబీఎస్‌లలో పార్కింగ్ పేరుతో దోపిడీ

హైదరాబాద్‌లోని జేబీఎస్, ఎంజీబీఎస్‌లలో బండి పార్క్ చేస్తే ప్రయాణికుల జేబులు ఖాళీ అవ్వాల్సిందే. ఎందుకంటే పార్కింగ్ పేరుతో నిర్వాహకులు ప్రయాణికులను దోచేసుకుంటున్నారు. పార్కింగ్‌ నిర్వాహకులు అడిగినంత ఇవ్వలేకపోతే వారు దౌర్జన్యానికి దిగుతున్నారు. పార్కింగ్‌ ఫీజుల్లో పారదర్శకత కోసం టిమ్స్‌ యంత్రాలను ప్రవేశపెట్టినా అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ప్రతి నిత్యం దోపిడీకి గురవుతున్నారు. జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఇటీవల పార్కింగ్‌ దోపిడీకి గురైన ప్రయాణికుడు సోషల్ మీడియాలో ఆందోళన చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ నగరంలోని బస్ స్టేషన్‌లలో పార్కింగ్‌ నిర్వహణ పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉంది. అయితే పార్కింగ్‌ ఫీజులను మాత్రం ఆర్టీసీ నిర్ణయిస్తుంది. కానీ అమలుపై ఆ సంస్థ నియంత్రణ కోల్పోతోంది. ద్విచక్ర వాహనాలకు 3 గంటలకు రూ.10 చొప్పున, 15 గంటలకు రూ.30 చొప్పున పార్కింగ్‌ ఫీజుగా వసూలు చేయాలి. ఒక రోజంతా బండిని పార్క్‌ చేస్తే రూ.50 చెల్లించాలి. కారు పార్కింగ్‌కు మూడు గంటలకు రూ.20, 15 గంటలకు రూ.50, ఒక రోజంతా కారు పార్క్‌ చేస్తే రూ.75 మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ పార్కింగ్‌ ఫీజులు వాహనదారులకు స్పష్టంగా కనిపించకుండా బోర్డులను పార్కింగ్‌ స్థలాలకు దూరంగా ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఏదో హడావిడిలో ఉండే ప్రయాణికులు పెద్దగా పట్టించుకోకుండానే అడిగినంతా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ పార్కింగ్‌ ఫీజుల గురించి ప్రయాణికులు స్పష్టమైన అవగాహనతో నిలదీస్తే మాత్రం బెదిరింపులకు గురవుతున్నారు.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలలో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లు రద్దు

Advertisement

తాజా వార్తలు

Advertisement