క్రీడా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నపారిస్ ఒలింపిక్స్ క్రీడలు గత రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా అరుదైన గౌరవాన్ని సాధించింది. భారతీయ సంప్రదాయం ఒట్టిపడేలా తెలుపు రంగుపై త్రివర్ణ పతాకంలోని మరో రెండు వర్ణాలతో రూపొందించిన చీరను ధరించి ఆకట్టుకుందీ బ్యాడ్మింటన్ క్వీన్. అలాగే భారత పతాకాన్ని చేత పట్టుకుని భారత అథ్లెట్ల బృందానికి నాయకత్వం వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయింది సింధు.
తన జీవితంలో ఇంత కన్నా గొప్ప గౌరవం మరేదీ లేదంటూ సంబరపడిపోయింది. ప్రస్తుతం సింధు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా ఉంటాయి.
ఇదిలా ఉంటే ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో సింధు ధరించిన చీరపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన ఈ దుస్తులు చాలా చీప్ గా ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ నందితా అయ్యర్ సంచలన కామెంట్స్ చేశారు. ‘తరుణ్ తహిలియానీ.. మీరు డిజైన్ చేసిన ఈ వేడుకల యూనిఫామ్‌ల కన్నా మెరుగైన చీరలు రూ.200లకు ముంబయి వీధుల్లో నేను చూశాను. చౌకైన పాలిస్టర్, ఇకత్ ప్రింట్((!!!)తో దారుణంగా ఈ దుస్తులు దారుణంగా ఉన్నాయి. ఇందుకోసం ఇంటర్న్‌కి అవుట్‌సోర్స్ చేశారా? లేక ఆఖరి 3 నిమిఫాల్లో హడావిడిగా డిజైన్ చేశారా? భారతదేశ సుసంపన్నమైన నేత సంస్కృతికి, చరిత్రకు ఇది ఘోరమైన అవమానం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నందితా అయ్యార్. అయితే తన వ్యాఖ్యలు ఈ డిజైనర్ దుస్తులను ధరించిన క్రీడాకారిణి పట్ల అగౌరవం కాదని కూడా ఆమె వివరణ ఇచ్చారు.
కాగా ఒలింపిక్ ప్రారంభ వేడుకల కోసం ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాని భారతీయ అథ్లెట్ల కోసం దుస్తులను రూపొందించారు. పురుష అథ్లెట్లు తెల్లటి కుర్తా , నారింజ , ఆకుపచ్చ నక్సీ వర్క్‌తో అలంకరించబడిన బూండీ జాకెట్ ధరించారు. ఈ జాకెట్లపై ‘ఇండియా’ ఇన్ స్రిప్ట్, ఒలింపిక్ లోగో ఉన్న పాకెట్స్ కూడా ఉన్నాయి. ఇక మహిళలకు మూడు రంగుల మేళవింపుతో చీర, జాకెట్టును డిజైన్ చేశారు. ఇప్పుడిదే దుస్తులపై విమర్శలు వస్తున్నాయ. నాసిరకం దుస్తులు అంటగట్టారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.