పారిస్ ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల పోరు మొదలైంది. తొలి రోజు భారత షూటర్ల కు నిరాశ తప్పలేదు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్, రమిత- అర్జున్ బబుతా జోడీలు ఫైనల్‌కు చేరుకోలేకపోయాయి. శనివారం జరిగిన షూటింగ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో రమిత-అర్జున్ బబుతా జోడీ 628.7 స్కోర్‌తో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
మరో జోడీ వలరివన్- సందీప్ సింగ్ 626.3 పాయింట్లతో 12 స్థానానికి పరిమితమైంది. టాప్-4లో ఉన్న వారు ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తారు.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. టాప్ 8లో చోటు దక్కకపోవడంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. శనివారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో షూటర్ సరబ్‌జోత్ త్రుటిలో అవకాశాన్ని కోల్పోయాడు. ఒక దశలో టాప్3లోకి దూసుకెళ్లినప్పటికీ చివరకు 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఫైనల్ అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నాడు. అటు అర్జున్ చీమా 18వ స్థానానికి పరిమితమయ్యాడు.
నాలుగో స్థానంలో బాల్‌రాజ్..
ఇక రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్‌లో భారత్ తరఫున పోటీ చేసిన బాల్‌రాజ్ పన్వర్ నాలుగో స్థానంలో నిలిచాడు. హీట్ 1లో పోటీ చేసిన అతడు 7:07.11 నిమిషాల్లో అతడు రేసును పూర్తి చేశాడు. నాలుగో స్థానంలో ఉండటంతో అతడు ఇప్పుడు రెపిచేజెస్ రౌండ్‌కు చేరుకున్నాడు. దీంతో సెమీఫైనల్ , ఫైనల్‌కు చేరుకునేందుకు అతడికి మరో అవకాశం లభించింది.