ఆమె ఫ్రాన్స్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్త.. ఇతను భారత్‌లో ఓ సాధారణ టూర్ గైడ్.. ఇద్దరి మనస్సులు కలిశాయి.. దీంతో మూడు ముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆమె పేరు మేరీ లోరి హెరాల్.. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో నివాసం ఉంటుంది. ఓ వ్యాపారవేత్త కూడా.. ఆరేళ్ల క్రితం భారత్‌లో అడుగుపెట్టింది. అదే సమయంలో టూర్ గైడ్‌గా ఉన్న రాకేశ్ పరిచయం అయ్యాడు. రాకేశ్‌ది.. బీహార్‌లోని బెగుసరాయ్ ప్రాంతంలో ఉండే కథారియా గ్రామం. విదేశీ పర్యాటకులకు భారత్‌లోని ప్రముఖ కట్టడాలను చూపిస్తుంటాడు. వాటి గురించి వివరిస్తుంటాడు.
టూర్ గైడ్‌గా మేరికి రాకేశ్ పరిచయం అయ్యాడు. వృత్తి రీత్యా భారత్‌లోని పలు ప్రాంతాలను మేరికి రాకేశ్ చూపించాడు. ఇక్కడి సంస్కృతీ, సంప్రదాయాలకు మేరి ఫిదా అయ్యింది. దీనికితోడు రాకేశ్‌పై మనసు పారేసుకుంది. పని పూర్తవ్వడంతో కొన్ని రోజులకు మేరీ ప్యారిస్‌కు వెళ్లిపోయింది. అయినా వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగుతూనే ఉంది. ఒకరంటే ఒకరికి ఇష్టం అని తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమను పెళ్లి పీటల దాకా తీసుకెళ్దామనుకున్నారు. ప్యారిస్‌కు వస్తే కలిసి వ్యాపారం చేద్దామంటూ.. రాకేశ్‌కు మేరీ కబురు పంపింది. దీంతో మూడేళ్ల క్రితం రాకేశ్ ప్యారిస్ వెళ్లాడు. ఇద్దరూ కలిసి గార్మెంట్ వ్యాపారం ప్రారంభించారు.
ఇదే సమయంలో.. పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎగిరి గంతేశారు. మేరి తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌లో వాలిపోయింది. హిందూ సంప్రదాయ ప్రకారం రాకేశ్, మేరీ ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి ఆదివారం బెగుసరాయ్‌లో జరిగింది. కొన్ని నెలలు భారత్‌లో గడిపిన తరువాత.. కొత్త జంట మళ్లీ ప్యారిస్ వెళ్లిపోనుంది. ప్రేమకు హద్దుల్లేవని మరోసారి నిరూపితమైంది. ప్యారిస్‌లో వ్యాపారం చేస్తున్న ఓ మహిళా.. భారత్‌లో టూర్ గైడ్‌గా పని చేస్తున్న రాకేశ్‌ను పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యంగానే ఉంది..!