Tuesday, November 26, 2024

9 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన సుఖాంతం.. బాలుడిని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గింత‌

9 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘ‌ట‌నను పోలీసులు నాలుగు గంట‌ల్లో ఛేదించి.. బాలుడిని సుర‌క్షితంగా త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు అనంత‌పురం పోలీసులు. స్థానిక శారదానగర్ లో నివాసముంటున్న బట్టల దుకాణం యజమాని షేక్ బాబా వలి కొడుకు సూరజ్ (9) ను కిడ్నాప్ చేసినట్లు అగంతకుడి నుండి బాలుడి తండ్రికి నిన్న సాయంత్రం 6:15 గంటల సమయంలో ఫోన్ కాల్ వ‌చ్చింది. రూ.50 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే చంపుతామని అగంతకులు ఫోన్ లో బెదిరించారు. డిమాండ్ చేసిన రూ.50 లక్షలను ఒక్కడివే టూవీలర్ లో తీసుకురావాలని ఆగంతకుల నుండి మరోసారి ఫోన్ కాల్ వ‌చ్చింది. ఈవిషయం రాత్రి సుమారు 7 గంటల సమయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపీఎస్ దృష్టికి వెళ్లింది. జిల్లాలోని పోలీసులను హై అలెర్ట్ యాప్ ద్వారా అలెర్ట్ చేసి వెహికల్ చెకింగ్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఇన్ఛార్జి, ట్రాఫిక్, తాడిపత్రి డీఎస్పీలు ఆర్ల శ్రీనివాసులు, ప్రసాదరెడ్డి, చైతన్యలు… సి.ఐ లు రవిశంకర్ రెడ్డి, కత్తి శ్రీనివాసులు, జాకీర్ హుస్సేన్ … ఎస్సైలు కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటెశ్వర్లు ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలు, 100 మంది సిబ్బందిని రంగంలోకి దించి జల్లెడ పట్టారు. నిన్న రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో యాడికి పోలీసు స్టేషన్ పరిధిలోని ముప్పాల-వెంగన్నపల్లి మధ్యలోని పొలాల్లో ఉన్న కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని వారి చెరలో ఉన్న బాలుడిని సురక్షితంగా పట్టుకున్నారు.

కిడ్నాపర్లు…అనంతపురం నవోదవ కాలనీకి చెందిన షేక్ నభీరసూల్, లక్ష్మీకాంత్ @ శ్రీకాంత్ లుగా గుర్తించి వారి నుండీ టూవీలర్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు నిందితులు కూడా గ్రానైట్ బండలు పరిచే కార్మికులుగా పని చేస్తున్నారు. ఇద్దరూ అప్పులపాలై వాటిని తీర్చుకోవాలని కిడ్నాప్ నకు ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడించారు. కమలానగర్ లో స్టైల్ జెంట్స్ షో రూం నిర్వహిస్తున్న షేక్ బాబావలీతో నిందితుల్లో ఒకరైన లక్ష్మీకాంత్ @ శ్రీకాంత్ గతంలో పని చేసేవాడు.ఈ క్రమంలో డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసి షేక్ బాబావలీని డిమాండ్ చేయాలని ఇద్దరూ భావించి కార్యాచరణకు దిగారు. స్థానిక బైరవనగర్ లో స్నేహితులతో కలసి ఆడేందుకు వెళ్లిన సూరజ్ ను పథకం ప్రకారం కిడ్నాప్ చేసి టూవీలర్ లో ఎత్తుకెళ్లి ముప్పాల- వెంగన్నపల్లి సమీప పొలాల్లో పోలీసులకు చిక్కారు. జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించడం… జిల్లా పోలీసులను ఏకతాటిపైకి సంయుక్తంగా తీసుకురావడంతో బాలుడి కిడ్నాప ఘటన సుఖాంతమైంది. కొడుకును సురక్షితంగా అందజేసిన పోలీసులకు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. బాలుడి కిడ్నాప్ ఘటన ఛేధింపులో సహకరించిన పుప్పాల గ్రామస్తులను, ప్రత్యేక బృందాలను, యాడికి పోలీసు సిబ్బంది భూపతిరాజు, రాము, రంగస్వామిలను ఎస్పీ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement