పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. ఈరోజు (మంగళవారం) జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 రేసులో పారా అథ్లెట్ దీప్తి 55.82 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఈ రేసులో దీప్తి జీవన్‌జీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పతకంతో పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య (స్వర్ణ3, రజత5, కాంస్యం*8) 16కు చేరింది. కాగా ఈ పోటీలో 55.16 సెకన్లతో అగ్రస్థానంలో నిలిచిన యూలియా షుల్యార్ స్వర్ణ పతకాన్ని అందుకుంది. మరోవైపు టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ (55.23) రజతం సాధించింది.
అవనీకు నిరాశ
పారాలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత స్టార్ మహిళా షూటర్ అవనీ లేఖారాకు 50మీ రైఫిల్ 3పీ ఫైనల్లో మాత్రం నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన మహిళల వ్యక్తిగత విభాగం 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్‌హెచ్-1 ఫైనల్లో అవనీ లాఖారే 5వ స్థానంతో సరిపెట్టుకుంది. కాగా ఈ పోటీలో 456.5 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచిన జర్మనీ షూటర్ నతాషా హిల్‌ట్రాప్‌కు స్వర్ణ పతకం లభించింది. మరోవైపు స్లోవేకియాకు చెందిన వెరోనికాకు (456.1) రజతం, చైనాకు చెందిన జాంగ్ (446)కు కాంస్య పతకం లభించాయి.
క్వార్టర్ ఫైనల్లో పూజా ఓటమి…
పారా ఆర్చరీ మహిళల వ్యక్తిగత రీకర్వ్ ఓపెన్ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లో పూజా 4-6 తేడాతో చైనాకు చెందిన వు చున్‌యాన్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో ఆర్చరీలో పూజా అద్భుత ప్రయాణం ముగిసింది. తృటిలో పతకావకాశాన్ని కోల్పోయిన పూజా టోర్నీ ఆరంభం నుంచి దూకుడైన ప్రదర్శనలతో అందరి మనసులు గెలుచుకుంది.