నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీ-జీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీ-జర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మార్చి 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ”కనుల చాటు- మేఘమా..” అంటూ సాగే తొలి గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. సినీ రచయిత లక్ష్మీ భూపాల సాహిత్యం అందించారు. ఆభాస్ జోషి ఆలపించారు. ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఈ పాట రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ. చక్కటి మెలోడీ ట్యూన్ కి పాట రాసే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టం.. కనులచాటు- మేఘమా అంటూ సాగే సాహిత్యం అద్భుతంగా కుదిరింది… అతిశయోక్తిలా అనిపించినా నా పాటకు నేనే ఫ్యాన్ అయిన సందర్భం ఇది… ఆభాస్ జోషి ప్రాణం పెట్టేశాడు తన తియ్యని గొంతులో… చాలాకాలం పాటు- ప్రేక్షకుల హృదయాల్లో ఇది ఖచ్చితంగా గుర్తిండిపోయే పాట అవుతుందని నమ్ముతున్నాను .. అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ ”కళ్యాణ్ ఒక అద్భుతమైన మెలోడీని స్వరపరిచారు. లక్ష్మీ భూపాల గారు కనుల చాటు- మేఘమా.. కాస్త ఆగుమా. వెనుక రాని నీడతో.. రాయబారమా అంటూ సోల్ ఫుల్ లిరిక్స్ అందించారు.” అన్నారు.
సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ ” ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నాకు అంత్యంత ఇష్టమైన సినిమా, అంత్యంత మంచి సినిమా. ఇందులోని కనుల చాటు- మేఘమా అనే పాట నాకు ఎంతో ఇష్టమైనది. ఈ పాట ఇచ్చిన తృప్తి నా 20 ఏళ్ల సినీ జీవితంలో ఏ పాట ఇవ్వలేదు. ఈ పాట చాలాకాలం పాటు- ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను.” అన్నారు.
నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్ నటిస్తున్నారు.