Saturday, November 23, 2024

పంట‌ల్లేవ్‌.. రికార్డుల్లోనే అధిక సాగు, ఆఫీస‌ర్ల ఒత్తిడితో త‌ప్పుడు లెక్క‌లు.. వ్య‌వ‌సాయంపై రైతుల‌ అనాస‌క్తి!

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎపుడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ లో వింత ధోరణి ఆవిష్కృతమైంది. ఆగస్టు చివరి వారం వచ్చినా పలు జిల్లాల్లో చాలా చోట్ల సేద్యం లేక భూములు ఖాళీగా కనిపిస్తుండగా , మరో వైపు అధికారిక రికార్డుల్లో పంట సాగు నమోదు కావడం విశేషం. గణాంకాలు తాత్కాలికమని పేర్కొని కాగితాలపై సేద్యపు విస్తీర్ణాన్ని పెంచి చూపిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. అందుకు ప్రభుత్వం నుంచి పలు విధాలా వస్తున్న ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. డీజిల్‌, పెట్రోలు, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాల ధరల పెరుగుదల, పండించిన పంటలకు గిట్టుబాటుధర లేమి, విపత్తు నష్టాలు ఇత్యాది సమస్యలతో రైతులు పంటల సేద్యంపై నిరాశ ఏర్పరుచుకున్నారు.

దీంతో సీజన్‌ ప్రారంభం నుంచీ సాగు ఉత్సాహంగా సాగట్లేదు. రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాలోని మెట్ట, డెల్టా ప్రాంతాల్లో సైతం చాలా చోట్ల సాగు తగ్గినట్లు సమాచారం. పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా సాయాన్ని, పంటలు సాగు చేయకపోతే వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందన్న ప్రచారంతో రైతులు ఏదో ఒక పంట వేసినట్లు ఇ-క్రాప్‌, ఇతర రికార్డుల్లో నమోదు చేయిస్తున్నారు. రాయలసీమలో వేరుశనగ గిట్టుబాటు కాక రైతులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు నాణ్యత లేమి, బహిరంగ మార్కెట్‌ కంటే ఎక్కువ ధర ఉండటంతో సబ్సిడీ విత్తనాలను చాలా చోట్ల నిరాకరించారు.

అయితే భరోసా వెనక్కి ఇచ్చేయాలనడంతో, భరోసా సొమ్ముతో రాయితీ విత్తనాలు తీసుకున్నా పంట వేయలేదు. అటువంటి రైతుల పేర్లను పంట సాగు చేసినట్లుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. పంటల బీమా, పంట రుణాల రెన్యువల్‌, వడ్డీ రాయితీ పథకాలు వర్తిస్తాయంటున్నారు. ఇప్పటి వరకు కొన్ని చోట్ల వాస్తవానికి పంటల సేద్యం 45నుంచి 55 శాతమే జరగ్గా, 60నుంచి70 శాతం వరకూ చూపించారని తెలుస్తోంది.

అధికంగా పత్తి 92 శాతం సాగు..

గతేడాది పత్తి రికార్డు స్థాయిలో క్వింటా రూ. 15 వెలవరకు పలకడంతో రైతులు పత్తి పంతవైపు మొగ్గు చూపారు. దీంతో ఖరీఫ్‌ సీజన్లో అత్యధికంగా పత్తి 92 శాతం సాగాయినట్లు సమాచారం.వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం ఆగస్టు 17 నాటికి విశాఖ జిల్లాలో 25 శాతం లోపు పంటలు సాగయ్యాయి. అల్లూరి, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలలో 50 శాతం లోపు పంటలు వేశారు. ఈ సమయానికల్లా వేరుశనగ సాగు పూర్తి కావాలి. కానీ ఆ పంట 77 శాతమే సాగైంది. ఇప్పటికి పప్పుధాన్యాల సాగు దాదాపు పూర్తి కావాల్సి ఉండగా 42 శాతమే సాగయ్యాయి. ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే కందులు 57 శాతమే సాగయ్యాయి. మొత్తంగా ఆహార పంటలు 80 శాతం వేశారు. వరి 63 శాతం సాగైంది. నూనెగింజలు 80 శాతం సాగయ్యాయి.

- Advertisement -

తెగుళ్లతో రైతుల బేజారు..

ఇదిలావుండగా ఖరీఫ్‌ సీజన్లో సాగు అంతంతమాత్రంగా ఉండగా వేసిన పంటలపై తెగుళ్లు విజృంభించి నష్ట వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. దాదాపు లక్ష ఎకరాల్లో పత్తికి వివిధ రకాల తెగుళ్లు వ్యాపించాయి. వేరుశనగ 50 వేల ఎకరాల్లో తెగుళ్లు సోకాయి. వరి, మిరప, మొక్కజన్న, ఆముదాలకు వివిధ తెగుళ్లు వ్యాపించాయి. సకాలంలో గుర్తించి సస్యరక్షణా చర్యలు చేపట్టడం వలన అదుపు చేయగలిగామని, నష్టం లేదని వ్యవసాయశాఖ చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement