Tuesday, November 26, 2024

చిన్న చిత్రం-ఐదు క‌థ‌లు-అదే పంచ‌తంత్ర కథ‌లు..

ఈ మ‌ధ్య కాలంలో పెద్ద చిత్రాలు..చిన్న సినిమాలు అనే తేడాలు లేకుండా పోయాయి. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలు కూడా హిట్ట్ కొట్టి నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షాన్ని కురిపించ‌డ‌మే కాదు..న‌టీ న‌టుల‌కు ఆఫ‌ర్ల‌ని తెచ్చి పెడుతున్నాయి. ఇప్ప‌టికే ఎన్నో చిన్న సినిమాలు త‌మ స‌త్తాని చాటాయి. కాగా రీసెంట్ గా తెర‌కెక్కిన పంచ‌తంత్ర క‌థ‌లు కూడా డిఫ‌రెంట్ క‌థ‌నంతో రూపొందింది.
ఐదు వేరు వేరు క‌థ‌లతో ఆంథాల‌జీగా తెర‌కెక్కింది ఈ చిత్రం. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి.మ‌ధు నిర్మించారు. గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడు..స్క్రీన్ ప్లే..డైరెక్ట‌ర్ గంగ‌న‌మోని శేఖ‌ర్ . నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఇప్పటికే , ట్రైల‌ర్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం గురించి ప‌లు విష‌యాలు మీ కోసం

కథ: ఈ చిత్రంలో అయిదు నీతి కథలు ఉన్నాయి.
మొద‌టిది- అడ్డ కత్తెర : కృష్ణ (నిహాల్) క్షవర వృత్తి(బార్బర్) చేసే యువకుడు. అదే వీధిలో వుంటున్న సత్య (సాదియ అన్వర్)ని ప్రేమిస్తుంటాడు. అయితే వీరి ప్రేమకు పెద్దల నుంచి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? వీరి ప్రేమకు శుభం కార్డు ఎలా పడిందనేదే మిగతా కథ.

రెండ‌వ‌ది – అహల్య రేవతి (ప్రణీత పట్నాయక్) తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వేశ్య వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తూ వుంటుంది. అయితే ట్రావెలర్ కం లైవ్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అయోధ్య (అజయ్ బిగ్ బాస్ ఫేం) అనుకోకుండా రేవతికి పరిచయం అవుతాడు. అతని పరిచయం రేవతి జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చింది… ఆమె జీవితం చివరికి ఎలా ముగిసింది అనేది మిగతా కథ.

మూడ‌వ క‌థ ఏంటంటే- హ్యాపీ మ్యారీడ్ లైఫ్(Happy Married Life): కీర్తిక (నందిని రాయ్) కి డబ్బుకి… లగ్జరీ లైఫ్ కి బాగా అలవాటు పడిన అమ్మాయి. చివరకు ప్రాణంగా ప్రేమించిన ప్రశాంత్ (నోయల్) ని కూడా కూడా కాదని… బాగా డబ్బున్న అబ్బాయి సంబంధం రావడంతో అతన్ని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. తనని మోసం చేసిన కీర్తికకి… ప్రశాంత్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనేది మిగతా కథ.

నాలుగ‌వ క‌థ -నర్తనశాల (Narthanashala): డ్యాన్స్ మాస్టర్ (సాయిరోనక్) మొబైల్ లో పరిచయం అయిన శిరీష (శశికళ)ను ఎంతో గాఢంగా ప్రేమిస్తుంటాడు. ఆమెను ఒకసారైనా చూడాలని పరితపిస్తూ వుండే డ్యాన్స్ మాస్టర్… ఓసారి బీచ్ కి రా అని శిరీషని రిక్వెస్ట్ చేస్తాడు. మరి బీచ్ లో వీరిద్దరూ కలిసారా? అక్కడ డ్యాన్స్ మాస్టర్ కి ఎలాంటి అనుభవం ఎదురైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

- Advertisement -

ఆఖ‌రిగా ఐద‌వ క‌థ – అనగనగా…(Anaganaga…): కమలక్మమ(గీత భాస్కర్)… ఇద్దరు కుమారుల మధ్య నలిగిపోయే జీవితం. తన భర్త వున్నంత కాలం ఎంతో స్వతంత్రంగా… హుందాగా జీవించిన ఆమె… వృద్దాప్యంలో ఇద్దరు కోడళ్ళ మధ్య ఎలా సాగిందనేదే ఈ అనగనగా… మిగతా కథ.

విశ్లేషణ – చిన్న‌త‌నంలో చాలా మంది పంచ‌తంత్ర క‌థ‌లు పుస్తకం చ‌దువుకుని… వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్న‌వారే. అలాంటి క‌థ‌ల ఇన్సిపిరేష‌న్ తో తెర‌కెక్కిన ఈ పంచ‌తంత్ర క‌థ‌లు మూవీ నుంచి కూడా నిజ జీవితంలో బ‌త‌కడానికి ఎంతో కొంత నీతిని ప్రేక్ష‌కులు నేర్చుకునే థియేట‌ర్ నుంచి వెళ‌తారు అన‌డంతో సందేహం లేదు. ఇందులో వున్న మొత్తం ఐదు క‌థ‌ల్లో ప్ర‌తి దాని నుంచి కూడా ఏదో ఒక నీతి సూత్రాన్ని మెసేజ్ రూపంలో చూపించారు. మొద‌టి క‌థ‌లో… కులాల మ‌ధ్య వుండే అంత‌రాల‌తో ఎలాంటి పోక‌డ‌ల‌తో స‌త‌మ‌త‌మవుతోందనేది రోజూ చూస్తూనే వున్నాం. దాన్ని తొల‌గించాల‌నే ఉద్దేశంతో మ‌నం చేసే వృత్తుల వ‌ల్ల కులాల‌ను నిర్ణ‌యించారని, వాటి వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగంలేద‌ని ఇద్ద‌రి ప్రేమికుల‌ను ఒక‌టి చేసే క్ర‌మంలో పెద్ద‌ల‌కు వివ‌రించి చెప్పారు. కుల వృత్తులు మ‌నం సృష్టించుకున్న‌వి… కులాంత‌రాల‌ను ఈ ఆధున‌కి యుగంలోనూ ప‌ట్టించుకోవ‌డం ఏంటనేది చెప్పారు. అలానే అహ‌ల్య క‌థ‌లో… ఆది నుంచి ప‌డుపు వృత్తిలో కొన‌సాగుత‌న్న మ‌హిళ‌… ఆ వృత్తికి ఎంత దూరంగా వుండాల‌ని ప్ర‌య‌త్నించినా… ఆ మార్పును స‌మాజం అంగీక‌రించ‌ద‌ని, అందుకు ఓ పెద్ద యుద్ధ‌మే చేయాల‌నేది ఎంతో హృద‌య విదార‌కంగా చూపించారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లో న‌మ్ముకున్నోళ్ల‌ను మోసం చేయొద్దు… అనేది చూపించారు. ఎంతో ప్రాణ ప్ర‌దంగా ప్రేమించిన అబ్బాయిని కాద‌ని… తండ్రి మాట కూడా లెక్క చేయ‌కుండా కేవ‌లం డ‌బ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన అమ్మాయికి ఓ భ‌గ్న ప్రేమికుడు చెప్పే గుణ‌పాఠం… చాలా బాగుంది. వేగంగా పెరిగిపోతున్న ఈ ఆధునిక టెక్నాల‌జీ యుగంలో ఎంత‌గా జాగ్ర‌త్త‌గా వుండాలో చెప్పేదే న‌ర్త‌న‌శాల‌. ముఖ్యంగా అటు వైపు ఎవరు… ఎలాంటి వారున్నార‌నేది చూడ‌కుండా కేవ‌లం వాయిస్ ను బ‌ట్టి.. అమ్మాయి అని మోస‌పోయే యువ‌కుల‌ను చాలా మందిని నిత్యం చూస్తూనే వున్నాం. అలాంటి వారికి ఈ న‌ర్త‌న‌శాల క‌థ న‌చ్చుతుంది. అలాగే మూడు త‌రాల మ‌ధ్య అంత‌రాలు ఎలా వున్నాయి అనే దాన్ని అన‌గ‌న‌గా… రూపంలో హృద‌యాన్ని స్పృశించేలా తెర‌పై చూపించారు ద‌ర్శ‌కుడు గంగ‌న‌మోని శేఖ‌ర్.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే… మొద‌టి క‌థ‌లో క్ష‌వ‌ర వృత్తి చేసే యువ‌కుడు కృష్ణ పాత్ర‌లో నిహాల్… బాగా చేశాడు. అత‌నికి జోడీగా సదియ అన్వర్… సత్య పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించింది. ఈ జంట తెరపై చూడ ముచ్చటగా ఉంది. అలాగే రామ్ మిరియాల పాడిన నేనేమో మోతెవరి పాట ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.

అహ‌ల్య క‌థ‌లో రేవ‌తిగా ప్రణీత పట్నాయక్ పాత్ర‌కు ప్ర‌శంస‌లు అందుకోవ‌డం ఖాయం. ప‌డుపు వృత్తి చేసే యువ‌తి పాత్ర‌లో ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ బాగా ఒదిగిపోయింది. ఇందులో ట్రావెల‌ర్ కం లైవ్ పెయింటింగ్ ఆర్టిస్ట్ గా బిగ్ బాస్ పేం అజ‌య్, చిన్న కుర్రాడు భాను న‌ట‌న కూడా బాగా ఆక‌ట్టుకుంటుంది. న‌ర్త‌న‌శాల క‌థ‌లో సాయి రోన‌క్ న‌ట‌న బాగుంది. అలాగే అన‌గ‌న‌గా క‌థ‌లో.. గీత భాస్క‌ర్ న‌ట‌న హృద‌యాల‌ను తాకుతుంది. నాన‌మ్మ పాత్ర‌లో ఆమె బాగా లీన‌మై న‌టించింది. దాంతో ఆమె న‌ట‌న చివ‌ర్లో ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలించి వేస్తుంది. మూడు త‌రాల మ‌ధ్య అంత‌రాన్ని తేట తెల్లంగా చూపించే ఈ క్లైమాక్స్ క‌థ‌లోని గీత భాస్క‌ర్ పాత్ర‌కి ప్ర‌తి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు.

టెక్నీషియ‌న్స్… ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ‌లు… వాటిని న‌డిపించ‌డానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి. వీటికి త‌గ్గ‌ట్టు అజార్ షేక్ రాసిన సంభాష‌ణ‌లు బాగా కుదిరాయి. ముఖ్యంగా మారాలంటే యుద్దమే చేయాలి…అనే డైలాగ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్ర‌తి క‌థ నుంచి ఓ నీతి సూత్రం… నేటి స‌మాజానికి త‌గ్గ‌ట్టుగా చెప్ప‌డం బాగుంది. స‌య్య‌ద్ క‌మ్రాన్ అందించిన సంగీతం చిత్రానికి బాగా ప్ల‌స్ అయింది. ముఖ్యంగా పాట‌లు బాగున్నాయి. చిత్ర ద‌ర్శకుడు గంగ‌న‌మోని శేఖ‌ర్ యే సినిమాటోగ్రాఫ‌ర్ కావ‌డంతో మంచి విజువ‌ల్స్ తీశారు. దీనికి మ‌రో సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల కూడా త‌న వంతు స‌హ‌కారం అందించారు. ఎడిట‌ర్‌ శ్రీ‌నివాస్ వ‌ర‌గంటి ఎడిటింగ్ బాగుంది. సాధారణంగా తమ ఫస్ట్ మూవీకి నిర్మాత ఎలాంటి రిస్క్ లేని కమర్షియల్ ఫార్మాట్ ఎంచుకుంటారు. కానీ ఈ చిత్ర నిర్మాత డి. మ‌ధు… తొలి అటెంప్ట్ లోనే మంచి క‌థ‌ను ఎంచుకుని ఈ పంచ‌తంత్ర క‌థ‌లు తీయ‌డం అభినంద‌నీయం. మ‌రి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement